వాహనదారులు విధిగా హెల్మెట్,సీట్ బెల్ట్ ధరించాలి
ప్రమాదాల బారిన పడకుండా, ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 9: ప్రమాదాల బారిన పడకుండా, ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకునేందుకు వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ఎంతోమంది నిండు ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించకుని జిల్లా పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో..గురువారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. శిరస్త్రాణం ధరించాల్సిన ఆవశ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన ఈ ర్యాలీని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా జడ్జి, కలెక్టర్ లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ..హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయాలలో విలువైన నిండు ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతీ యేటా దేశంలో 1.5 లక్షల వరకు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు. ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్న వారు నిండు ప్రాణాలను కోల్పోతుండగా, వారి కుటుంబాలకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, చిన్నచిన్న సరదాలకు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చవద్దని హితవు పలికారు. రోడ్డు దుర్ఘటనలలో అత్యధికంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే దాదాపు 90 శాతం వరకు ప్రాణాపాయం బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందని సూచించారు. ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించడాన్ని అలవాటుగా చేసుకోవాలని, దీనిని కనీస బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఎదుటివారి వల్ల ప్రమాదాలకు గురైన సందర్భాలలోనూ హెల్మెట్ ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతుందని గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణ కోసం వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, నిబధనల మేరకు జరిమానాలు విధించడం వంటివి చేస్తున్నప్పటికీ, ఎవరికివారు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించినప్పుడే ప్రమాదాలకు కళ్లెం వేయవచ్చని సూచించారు.
హెల్మెట్ల వినియోగం అత్యావశ్యకం, సురక్షితం అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రమాదాలను నిలువరించేందుకు ప్రతిఒక్కరు బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని హితవు పలికారు. ఈ సదర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచ్రక్ర వాహనదారులకు శిరస్త్రాణం ధరించాల్సిన అవశ్యకతను తెలియజేస్తూ, పలువురికి మాణిక్ బండార్ పాఠశాల సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా హెల్మెట్ లు అందజేశారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వారిని అభినందిస్తూ ముఖ్య అతిథులచే పుష్పగుచ్చాలు బహూకరించారు. అదేవిధంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రాణాంతకంగా పరిణమిస్తున్న చైనా మాంజాను వినియోగించ కూడదని, దీనిని నిషేధించడం జరిగిందని తెలిపారు. చైనా మాంజా నిషేధం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ముద్రించిన గోడ ప్రతులను జిల్లా జడ్జి, కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.గోపికృష్ణ, అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఖుష్బూ ఉపాధ్యాయ్, పి.శ్రీనివాస్ రావు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమినర్ దుర్గాప్రమీల, జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.