ఫార్ములా-ఈ రేస్ బేఖారు కేసు :మాజీ ఎమ్మెల్యే

ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని,కేటీఆర్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2025-01-09 16:34 GMT

దిశ, ఆర్మూర్: ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని,కేటీఆర్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఎప్పటికీ కేటీఆర్ కడిగిన ముత్యమని,ఇది కాలం చెప్పే సత్యమని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేటీఆర్‌ నిఖార్సయిన ఉద్యమకారుడన్నారు. తెలంగాణ స్వేచ్చ కోసం కదం తొక్కిన పోరు బిడ్డ అనిపేర్కొన్నారు.ప్రజాక్షేత్రంలో కేటీఆర్ ను మిస్టర్ క్లీన్ గా అభివర్ణించారు. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసింగ్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి ప్రయత్నం చేశారే తప్ప సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగా తన సోదరులకు, బావమరుదులకు దోచిపెట్టడానికి కాదని అన్నారు. రేవంత్ లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ అరపైసా అవినీతికి పాల్పడలేదని జీవన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై ఏదో రకంగా బురదజల్లి తాత్కాలిక ప్రయోజనం పొందాలని చూస్తున్నదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా కేటీఆర్ కడిగిన ముత్యంలా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతారని తెలిపారు. ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్‌ 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని, సర్కార్ దాష్టీకాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.


Similar News