15 వేల నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాం: మంత్రి జూపల్లి

ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన నష్టానికి రైతులు ఏ మాత్రం అధైర్యపడవద్దని, వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాధిత రైతులకు భరోసానిచ్చారు.

Update: 2024-03-21 07:27 GMT

దిశ, భిక్కనూరు: ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన నష్టానికి రైతులు ఏ మాత్రం అధైర్యపడవద్దని, వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బాధిత రైతులకు భరోసానిచ్చారు. గురువారం నాడు ఆయన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తో కలసి కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగండ్ల వాన కురిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ, రైతులకు సాయం చేయాలన్న ఉద్దేశంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో మాట్లాడి నష్టపోయిన ప్రతి పంటకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.

రైతులు పెట్టిన పెట్టుబడికి ఈ సాయం ఏమాత్రం సరిపోకపోయినప్పటికీ, రైతులను ఎంతోకొంత ఆదుకోవాలన్న ఉద్దేశంతో 10 వేల రూపాయలు చెల్లించాలని అనౌన్స్ చేయడం జరిగిందన్నారు. 15 వేల రూపాయలు చెల్లించాలని ఆలోచన చేస్తున్నామని దానికి కొంత కొంత సమయం పట్టవచ్చన్నారు. వడగండ్ల వానతో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. 25 వేల రూపాయలు చెల్లించాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పటికీ గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్ప వల్ల ఏటా 60 కోట్ల రూపాయలు ప్రభుత్వం వడ్డీ కింద చెల్లిస్తుందన్నారు. నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎంత చేసిన తక్కువేనని, ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు ప్రభుత్వం అన్న ఉద్దేశంతో బాధిత రైతాంగాన్ని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 69 లక్షల మందికి మూడు నెలల వ్యవధిలో 60 లక్షలకు పైగా రైతు భరోసా ఇవ్వడం జరిగిందని, త్వరలోనే మిగిలిన రైతులకు రైతు భరోసా సాయం అందిస్తామని ప్రకటించారు. రైతులకు త్వరలోనే బీమా సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తుందని, నష్టపోయిన రైతులకు మాత్రం ఏ ఒక్కరికి మిస్ కాకుండా ప్రకటించిన నష్టపరిహారాన్ని తొందర్లోనే రైతుల ఖాతాలో జమవుతాయని రైతులకు ధీమా కల్పించారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తులు జరిగి రైతులు పంట నష్టపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నయా పైసా కూడా చెల్లించలేదని, రైతులను ఆదుకునే ప్రయత్నాలు కూడా చేయలేదన్నారు.

తమ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అందుకే విపత్తు జరిగిన మరుసటి రోజు నుంచి గ్రామాల్లో తాము తమ నాయకులు పర్యటిస్తూ పంటలను పరిశీలించడంతో పాటుగా నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. వారి వెంట మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, ఎంపీపీ అధ్యక్షుడు జాంగారి గాల్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంట లింగారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపరి భీమ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, తాటిపాముల లింబాద్రి, పి నరసింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Similar News