బైకులపై జోరు సవారీ....పోలీసుల కళ్లుగప్పి, రెచ్చిపోతున్న చోదకులు

రయ్.. రయ్... అంటూ డ్రైవ్ చేయడం... సౌండ్ ఎక్కువగా వచ్చే సైలెన్సర్ తో రేస్ పెంచుకుంటూ బైకులు నడపడమే కాకుండా.... నెంబర్ ప్లేట్లను మార్చి రోడ్లపై తిరగడం రివాజ్ గా మారింది.

Update: 2024-06-19 16:07 GMT

దిశ, భిక్కనూరు : రయ్.. రయ్... అంటూ డ్రైవ్ చేయడం... సౌండ్ ఎక్కువగా వచ్చే సైలెన్సర్ తో రేస్ పెంచుకుంటూ బైకులు నడపడమే కాకుండా.... నెంబర్ ప్లేట్లను మార్చి రోడ్లపై తిరగడం రివాజ్ గా మారింది. విలువైన వాహనాలతో పాటు, ఖరీదైన బైకులను ధర తక్కువకు అమ్ముతున్నారా...? లేక బైకులు చోరి చేసుకొచ్చి జోరుగా సవారీ చేస్తున్నారా అన్న ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. పోలీసులు మామూలుగా అయితే బైకు డ్రైవ్ చేసే వారిని హెల్మెట్, లైసెన్స్, ఉందా లేదా అని చూడడం, బైక్ కు సంబంధించిన కాగితాలు వారి వద్ద ఉన్నాయా లేదా అన్న విషయమై లోతుగా పరిశీలించి వదిలిపెడుతున్నారు.

డ్రంకన్ డ్రైవ్ లో కూడా వాహనాలను ఆపి, చోదకుల నోట్లో పైపువేసి వచ్చిన పర్సెంటేజీ ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. అయితే అప్పుడు కూడా వాహనాలకు సంబంధించిన పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే దొంగ బైక్ లకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. పోలీసుల ఏమరుపాటు తనాన్ని అవకాశంగా తీసుకొని బైక్ లపై జోరుగా చక్కర్లు కొడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. పైగా రోజుకో బైక్ పై తిరుగుతూ పాదాచారులను, పక్కనుండి వెళ్లే వాహనదారులను అదరగొడుతున్నారు. ఆ స్పీడ్ ఆ లెక్క చూసి భయంతో సిన్సియర్ గా వాహనాలు నడిపేవారు సైడ్ అయిపోవలసిన పరిస్థితి గ్రామాల్లో నెలకొంది.

ఆ విధంగా వాహనాలు నడిపి హడలెత్తించే వారిని, బైక్ ను ఆపి ప్రశ్నించే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఎవరైనా తప్పిదారి ప్రశ్నిస్తే... నువ్వేంది నాకు చెప్పేదంటూ ఎదురుదాడులకు దిగుతున్న సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. దొంగిలించుకు వచ్చిన బైక్ కోసం ఏకంగా వరుసకు బావమరిది అయిన కోటన్ రంజిత్ ను, బావ బాబా శేఖర్ కల్లు లో గడ్డి మందు కలిపి హతమార్చిన వైనం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో వెలుగు చూసిన విషయం విధితమే... జల్సాలకు... డ్రగ్స్ కు అలవాటు పడిన చాలామంది పార్క్ చేసిన వాహనాలను తీసుకెళ్తూ, ఎక్కడో ఒకచోట తక్కువ ధరకు అమ్మేస్తూ... సొమ్ము చేసుకుంటున్నారు.

ఆ విధంగా వచ్చిన సొమ్ము ఎంజాయ్ కి ఖర్చయిపోగానే, బైక్ లను దొంగిలించడం పరిపాటిగా మారిపోయింది. పైగా ఎత్తుకొచ్చిన బైకుల నెంబర్ ప్లేట్లను చేంజ్ చేస్తూ, వారి వద్ద ఉన్న రకరకాల నెంబర్ ప్లేట్లను బైక్ ల కు తగిలించి తిరుగుతున్నారు. పైగా లక్షలకు పైగా ధర పలికే బైక్ లను, ఫోర్ వీలర్ వాహనాలను ధర తక్కువకు కొనుగోలు చేసుకొచ్చి రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. అవి నిజంగా కొన్నవా...? లేక దొంగిలించిన వాహనాల అన్నది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ ను మారింది.

కొత్త టెక్నాలజీతో... గుర్తించొచ్చు.. భిక్కనూరు సీఐ సంపత్ కుమార్

కొత్త టెక్నాలజీ తో... బైకు దొంగ దా కాదా అన్నది గుర్తించొచ్చు అని "దిశ" కు వివరణ ఇచ్చారు. వెహికల్ చెకింగ్ చేసే సమయంలో ఈ టెక్నాలజీని యూస్ చేయడం జరుగుతుందన్నారు. సర్కిల్ పరిధిలో ఇప్పటికే నాలుగైదు బైక్ లను సీజ్ చేయడం జరిగిందన్నారు.


Similar News