యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలి
తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 18: తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి.యాదగిరి రావుకు గురువారం టీయూపీడీఎస్ యూ ఆధ్వర్యంలో..వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో తెలంగాణ యూనివర్సిటీలో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయని, పేద విద్యార్థులు యూనివర్సిటీ విద్యకు దూరమవుతున్నారన్నారు. బయట పీజీ కళాశాలలకు స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా ఖాళీలను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నప్పటికీ, టీయూలో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా ఖాళీ సీట్లను భర్తీ చేయడం లేదని రాజేశ్వర్ అన్నారు. ఈ సారైనా ఖాళీగా ఉన్న ఇంటిగ్రేటెడ్ కోర్సులు , పీజీ, ఎల్ ఎల్ బీ, బీఈడీ సీట్లను స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసి..గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్, రవీందర్, రాకేష్, బాలాజీ, నితిన్ తదితరులు పాల్గొన్నారు.