అకాల వర్షం.. అపార నష్టం..
నిజామాబాద్ జిల్లాలో మొన్న కురిసిన వడగళ్ల వాన దాదాపు నాలుగైదు మండలాల్లోని దాదాపు పది, పదిహేను గ్రామాల్లోని పంటలపై ప్రభావం చూపింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మొన్న కురిసిన వడగళ్ల వాన దాదాపు నాలుగైదు మండలాల్లో పంటలపై ప్రభావం చూపింది. ప్రత్యేకించి ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపడంతో.. ఎక్కవ మొత్తంలో నష్టం జరిగింది. బలమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా చేతికొచ్చిన వరి పంట, మొక్కజొన్న, మామిడి తోటలు చాలా వరకు నష్టపోయాయి. ఏపుగా పెరిగిన వరిపంట పూర్తిగా నేలకొరిగింది. గట్టి పడిన వరి ధాన్యం వందల ఎకరాల్లో రాలిపోయి నేలపాలైంది. ఎక్కువ మొత్తంలో రైతును అకాల వర్షం నష్టపరిచింది.
884 ఎకరాల్లో పంట నష్టం..
నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్ష ప్రభావంతో 884 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అదే నివేదికను ప్రభుత్వానికి నివేదించారు. ధర్పల్లి, సిరికొండ మండలాల్లో ఎక్కువగా పంట నష్టానికి గురైందని అధికారులు పేర్కొంటున్నారు. సిరికొండ మండలంలో అత్యధికంగా 380 మంది రైతులకు చెందిన 325 ఎకరాల్లో వరి పంట బాగా దెబ్బ తింది. హొన్నాజీ పేట్ 110 మంది రైతులకు సంబంధించిన 185 ఎకరాలు, చీమన్ పల్లి లో 86 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో వరి పంట నష్టాలపాలైంది. పెద్దవాల్గోట్ కు చెందిన 120 మంది రైతుల 59 ఎకరాల్లో వరి పంటను నష్టపోయారు. చిన్న వాల్గోట్ గ్రామ శివారులోని 86 మంది రైతులకు చెందిన 62 ఎకరాల్లో వరి పంట వడగళ్ల దెబ్బతో పూర్తిగా నేలపాలైంది మొక్కలో గట్టిపడిన ధాన్యపు గింజ నేల రాలి పోయి రైతులు బాగా నష్టపోయారు. ధర్పల్లి మండల కేంద్రలో 64 మంది రైతులకు చెందిన 80 ఎకరాల్లో కూడా పంట బాగా దెబ్బతిందని రైతులు ప్రాథమికంగా అంచాన వేసి ప్రభుత్వానికి నివేదించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ధర్పల్లి, సిరికొండ మండలాల్లో 884 ఎకరాల్లో 817 మంది రైతులు తమ పంటలు నష్టపోయారని ప్రాథమికంగా గుర్తించినట్లు చెపుతున్నారు. మొక్కజొన్న దాదాపు 42 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లాలో 136 ఎకరాల్లో దాదాపు 140 మంది రైతులకు సంబంధించిన 136 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని సదాశివనగర్, తాడ్వాయి, భిక్కనూరు, రాజంపేట్, దోమకొండ, గాంధారి మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు పండించిన మొక్కజొన్న వడగళ్ల వానతో దెబ్బతిందని అధికారులు తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా నివేదిక పంపినట్లు తెలిపారు.
అధికారుల లెక్కకు రైతుల లెక్కకు తేడాలు..
అధికారులు చెప్పిన నష్టం కంటే క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు నష్టపోయినట్లు రైతులు చెపుతున్నారు. కొద్ది మొత్తంలో నష్టపోయిన పంటలను అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదని, పెద్ద మొత్తంలో నష్టపోయిన పంటలనే లెక్కలోకి తీసుకుని నష్టాన్ని ప్రాథమిక అంచనాగా పంపినట్లు తెలుస్తోంది.
ఇంకా మొదలవని వ్యవసాయ, రెవెన్యూ జాయింట్ సర్వే..
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం రావాలంటే కచ్చితంగా పంట నష్టంపై వ్యవసాయాధికారులు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే నిర్వహించాలి. ఆ రెండు ప్రభుత్వశాఖలు సంయుక్తంగా సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ద్వారానే ప్రభుత్వం నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి నివేదించిన ప్రాథమిక అంచనా రిపోర్ట్ పరిశీలన తరువాత వ్యవసాయం, రెవెన్యూ శాఖలతో జాయింట్ సర్వే జరిపించాలని కోరుతున్నారు.
అమలు కాని ఫసల్ బీమా యోజన..
ప్రకృత్తి విపత్తులతో పంటలకు నష్టం వాటిల్లితే పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకం మన రాష్ట్రంలో అమలు కావడం లేదు. ఇప్పుడిది మా సావుకొచ్చిందని రైతులంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో కూడా అమలై ఉంటే ఇప్పుడు కచ్చితంగా ప్రతి ఎకరాకు కనీసం రూ. 20 వేలైనా పంట నష్టం చేతికొచ్చేదని, ఆ సాయాన్ని తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫసల్ బీమా సాయం వస్తే కొంతలో కొంతైనా రైతులకు ఊరటగా ఉండేదని రైతులంటున్నారు.
ఎకరానికి రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలి..
జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. పంట నష్టాలకు గురైన ప్రతి ఎకరానికి రూ. 50 వేల చొప్పున పరిహారం ఇప్పించాలి. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమని చెప్పుకోవడం కాదు.. అమల్లో చూపించాలి.
- దినేష్ కులాచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నిజామాబాద్ జిల్లా
రైతులకు జరిగే నష్టాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు
రైతులు కష్టపడి పంటలు పండిస్తారు. పంటలు తప్ప వేరే ప్రపంచం తెలియని రైతుల కష్టాన్ని ప్రభుత్వం తమ కష్టంగా భావించినప్పుడే పంటలు నష్టపోయే రైతులకు నష్టపరిహారం అందించడానికి వీలవుతుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులు అప్పుల పాలై తిప్పలు పడాల్సి వస్తుంది.
సంజీవ్ రెడ్డి (రైతు), కొండూరు, సిరికొండ మండలం