తాళాలు వేసిన ఇళ్లే వారి టార్గెట్.. తొమ్మిది ఇళ్లులు గుళ్ల

తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి, ఇళ్ల ముందు ఉన్న సీసీ

Update: 2025-03-28 08:09 GMT
తాళాలు వేసిన ఇళ్లే వారి టార్గెట్.. తొమ్మిది ఇళ్లులు గుళ్ల
  • whatsapp icon

 దిశ,భిక్కనూరు : తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి, ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను తెలివిగా కట్ చేసి, వేసిన తాళాలు పగులగొట్టి, ఒకే రోజు రాత్రి 9 ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గుర్తు తెలియని దుండగులు, ముందుగా రెక్కీ నిర్వహించి, ఆ తర్వాత అర్ధరాత్రి వచ్చి ఒక ఇల్లు తర్వాత మరో ఇల్లు అన్నట్టుగా తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి చొరబడి, తాళాలతో బీరువాలను ఓపెన్ చేసి విలువైన బంగారు వస్తువులను నగదును అపహరించుకుపోయారు.

మార్కండేయ ఆలయం వెనకాల ఉన్న రెండవ కాలనీలో డాకి రమేష్ ఇంట్లో చొరబడి మూడు తులాల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు, ఇతర వెండి వస్తువులు, అదే ఇంటిని ఆనుకొని ఉన్న, దాకి నాగమణి ఇంట్లో చొరబడి మూడు తులాల విలువ చేసే బంగారు ఆభరణాలు, పక్కనే ఉన్న మామిడి సత్తెవ్వ ఇంట్లో చొరబడి అర తులం బంగారు వస్తువులు,రూ. 5 వేల నగదును అపహరించుకుపోయారు. భాజ సుజాత ఇంట్లో, రూ. 9500 నగదు, స్టీల్ సామాను, వంక సువర్ణ ఇంట్లో చొరబడి ఆర్ తులాల వెండి కడియాలు, పావు తులం బంగారు ఆభరణాలు, అర తులం పుస్తే లు, మన్నె ధర్మరాజు ఇంట్లో తులం బంగారు వస్తువులు, 50 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. చింత చంద్రయ్య ( రిటైర్డ్ ఏఎస్ఐ ) ఇంట్లో చొరబడి తులం బంగారు ఆభరణాలు, రూ.పదివేల క్యాష్, దేవుని హుండీలో ఉన్న రూ.ఐదు వేల నగదు, చింత వినయ్ ఇంట్లో చొరబడి రూ. 5500 నగదు, సోన్నాయి ల స్వామి ఇంట్లో చొరబడి డబ్బాలో దాచి ఉంచిన పదిహేను వేల రూపాయల నగదును ఊడ్చుకెళ్ళారు.

ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన లింగరాజు నవీన్ కు చెందిన స్ప్లెండర్ ప్లస్ బైక్ ను దొంగలు అపహరించు పోయారు. చోరీ చేసిన రెండు మూడు ఇండ్ల ముందు, 50 రూపాయల కరెన్సీ నోట్లను పడవేసి వెళ్లారు. బీరువాలను వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లతో, కొన్ని ఓపెన్ చేయగా, మరికొన్నింటిని తాళాలు తీసి, బట్టలను వస్తువులను చిందరవందరగా పడవేసి, పగులగొట్టిన తాళాలను మురికి కాలువలలో వేసి హల్ చల్ చేశారు. సుమారు 15 లక్షల రూపాయల సొత్తును దుండగులు అపహరించుకుపోయారు.

క్లూస్ టీం రాక....

గ్రామంలో దొంగలు రెచ్చిపోయారన్న విషయం తెలుసుకుని భిక్కనూరు ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీమ్ ని రప్పించి, వేలి ముద్రలను సేకరించారు. ఆ తర్వాత బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News