ముగిసిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలు

రాష్ట్ర మహాసభల్లో చర్చించిన అంశాల ద్వారా రాబోయే రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు భాగం హేమం త్ రావు, అన్నారు.

Update: 2025-03-27 16:38 GMT
ముగిసిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలు
  • whatsapp icon

దిశ, నిజామాబాద్ అర్బన్ మార్చి 27: రాష్ట్ర మహాసభల్లో చర్చించిన అంశాల ద్వారా రాబోయే రోజుల్లో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు భాగం హేమం త్ రావు, అన్నారు.  ఈనెల 25 నుండి మూడు రోజులుగా నిజామాబాద్ లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభల్లో గురువారం చివరి రోజు సభనుద్దేశించి వారు మాట్లాడారు. మూడు రోజుల పాటు జరిగిన మహాసభలు విజయవంతం కావడం పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఏప్రిల్ 8 న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని మహాసభల్లో ఆయన పిలుపుచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, మాజీ శాసన సభ్యులు ఉజ్జయిని యాదగిరిరావులు మాట్లాడుతూ.. రైతు సమస్యలపై నిరంతరం పోరాటాలు జరపాలన్నారు. రైతులు అభివృద్ది చెందాలంటే, రైతు శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. మహాసభలకు మహిళ రైతులను కూడా హాజరయ్యేలా చేయడం ద్వారా వ్యవసాయంలో లాభాలు సాధ్యమవుతాయని పిలుపు నిచ్చారు. రైతులకు ఉపయోగపడే పలు సూచనలను చేశారు.

మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టగా, 32 మంది చర్చల్లో పాల్గొన్నారు. నివేదికను ఏకగ్రీవంగా ఆమోదించారు. మహాసభ 14 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. 109 మందితో రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటైంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు 21 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గా ఎంపికయ్యారు. అధ్యక్ష, కార్యదర్శులుగా హేమంత్ రావు, పశ్యపద్మలు తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఉజ్జిని యాదగిరిరావు, కంజర భూమయ్య, కొప్పోజు సూర్యనారాయణ, కొల్లూరు రాజయ్య, దొండపాటి రమేశ్, వి.ఎస్ ప్రసాద్ శాస్త్రి, ప్రభులింగం, నెట్టెం నారాయణ, మిడకంటి వెంకట్ రెడ్డి, బొల్లు ప్రసాద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా వర్ల వెంకటయ్య, కంబాల శ్రీనివాస్ , చంద్ర నరేంద్ర కుమార్ , చిలక దేవిదాస్ , దేవ భక్తుని సంధ్య , కోశాధికారిగా ఎన్నికయ్యారు. గ్రామ, మండల స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేయాలని, ఆ కమిటీల ద్వారానే సమస్యల పరిష్కారం దొరుకుతుందని అన్నారు.

మహాసభ ఆమోదించిన తీర్మానాలు

హైదారాబాద్ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో 111 జీఓని ఎత్తి వేయాలని తీర్మానించారు. డాక్టర్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత చేయాలని, కౌలు రైతులకు రైతు భరోసా, గుర్తింపై కార్డులు ఇవ్వాలని, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలకు సాగునీరు కల్పించాలని, రాష్ట్రంలోని, పోడు భూములకు, సాదా బైనామా దరఖాస్తు దారులకు పట్టాలు ఇవ్వాలని, పంటలకు పంటల బీమా పథకం ఏర్పాటు చేసి, రైతులు పండించిన పంటల నిల్వకు గోదాములు నియమించాలని, మహబూబాబాద్ జిల్లాలో ఎర్రచందనం మార్కెట్ సౌకర్యం కల్పించాలని తీర్మానించారు.

ములుగు జిల్లాలో నకిలీ విత్తనాలు, జన్యు మార్చిడి విత్తనాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం కల్పించాలని తీర్మానించారు. ధాన్యం ఉత్పత్తి దారుల సంఘంను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని, భైంసా మండలం రంగారావు ప్రాజెక్ట్ ద్వారా ముంపుకు గురవుతున్న గూడెం గ్రామంలో 450 కుటుంబాలు నష్ట పోతున్నారని, బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని సభలో తీర్మానించారు. నవాబుపేట రిజర్వాయర్ ద్వారా యాదాద్రి జిల్లా గుట్ట గంధమల్ల రిజర్వాయర్ లో పనులు పూర్తి చేయాలని, సాగు నీరు అందించాలని, ఎస్ ఎల్ బి సొరంగం పూర్తి చేయాలన్నారు. బ్రహ్మం వెల్లెల్లి ప్రాజెక్టును కృష్ణపురం వరకు కాల్వలు ఏర్పాటు చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు.

వాజేడు మండలంలో రైతులకు సమ్మక్క సారక్క బ్యారేజీ ద్వారా సాగునీరు అందించాలి. మహిళా రైతులకు పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ పట్టు పరిశ్రమ పుట్టగొడుగుల పరిశ్రమ వీటికి 90 శాతం సబ్సిడీ ఇచ్చి మహిళా రైతులను ప్రోత్సహించాలని ఈ మహాసభ తీర్మానించారు. 55 ఏళ్లు నిండిన రైతులకు రూ. 10 వేల పెన్షన్ అందించి, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఎకరానికి రూ. 2 లక్షల పంట రుణం ఇవ్వాలని తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి సుధాకర్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, ఏ ఐ ఎస్ ఎఫ్ రఘురాం, వివిధ జిల్లాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Similar News