అసంపూర్తిగానే డివైడర్ పనులు..

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలైన పెర్కిట్, మామిడిపల్లి గ్రామాల్లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీయూఎఫ్ఐడీసీ నిధులతో మున్సిపల్ అధికారులు హడావిడిగా ఆర్మూర్ మున్సిపల్ లో ప్రధాన జాతీయ రహదారుల వెంట డివైడర్ పనులను చేయించారు.

Update: 2024-07-05 09:31 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలైన పెర్కిట్, మామిడిపల్లి గ్రామాల్లో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీయూఎఫ్ఐడీసీ నిధులతో మున్సిపల్ అధికారులు హడావిడిగా ఆర్మూర్ మున్సిపల్ లో ప్రధాన జాతీయ రహదారుల వెంట డివైడర్ పనులను చేయించారు. డివైడర్ పనులు చేపట్టి సుమారు సంవత్సర కాలం కావస్తున్నా ఇంకా అసంపూర్తిగానే జాతీయ రహదారుల వెంట దర్శనమిస్తున్నాయి. జాతీయ రహదారుల వెంబడి గతంలో ఉన్న చిన్నపాటి డివైడర్లను తొలగించి.. హడావిడిగా అందంగా ముస్తాబు చేసేందుకు హైదర్ రాళ్లతో రెండు పక్కల డివైడర్లను ఎత్తుగా కట్టించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి పెర్కిట్ ఏరియాలో జాతీయ రహదారుల వెంబడి ఎత్తుగా కట్టించిన డివైడర్ మధ్యలో సంవత్సర కాలం కావస్తున్న ఇంతవరకు మట్టితో నింపిన ఆనవాళ్లు కనబడడం లేదు.

దీనికి సంబంధించిన డివైడర్ల బిల్లును ఏ తరహాలో మున్సిపల్ నుంచి సదరు కాంట్రాక్టర్ కు అధికారులు చెల్లించారో ఏమో తెలియదు. ఈ డివైడర్ మధ్యలో గతంలో పెట్టిన చెట్లను యధా స్థానాల్లోని ఉంచినప్పటికిని, కనీసం ఆ డివైడర్ మధ్యలో ఎర్ర మట్టితో నింపి పచ్చటి ఆహ్లాదకరమైన అందాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు అంటున్నారు. ఆ డివైడర్ ను మట్టితో భర్తీ చేయక అలాగే వదిలేయడంతో మధ్యలో ఇష్టారీతిగా పిచ్చి మొక్కలు పెరుగుతూ ప్రధాన జాతీయ రహదారుల వెంట ఎబ్బెట్టుగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా ఆర్మూర్ మున్సిపల్ లో విలీన గ్రామాల్లో ప్రధాన రహదారులైన జాతీయ రహదారుల వెంబడి నిర్మించిన డివైడర్లలో మట్టిని నింపాలని ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.


Similar News