లబోదిబో మంటున్న పసుపు రైతు..

ఉత్తర తెలంగాణ రైతులకు బంగారు పంటగా భావించే పచ్చబంగారం పసుపు ధర పడిపోయింది.

Update: 2023-02-08 16:06 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ రైతులకు బంగారు పంటగా భావించే పచ్చబంగారం పసుపు ధర పడిపోయింది. గతంలో ఎన్నడు లేని విధంగా క్వింటాల్ కు రూ.5 వేలు దిగువకు తగ్గిపోవడంతో రైతుల్లో దిగాలు నెలకొంది. దేశంలో నాణ్యమైన పసుపును పండించే రైతులుగా ఉత్తర తెలంగాణ రైతులు ప్రసిద్దగాంచారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కేంద్రంగా పసుపు క్రయవిక్రయాలు జరుగుతుండడం సర్వసాధారణం. కానీ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో బుధవారం మోడల్ పసుపు ధర రూ.4888 పలుకడం గమనార్హం. అత్యధికంగా మంచి ధర రూ.5939 కాగా అత్యల్ప ధర రూ.5 వేల లోపు ఉండడం రైతులను కుదేలు చేసింది.

ఈ యేడాది కురిసిన అత్యధిక వర్షాల నేపథ్యంలో దుంపకుళ్లు కారణంగా పసుపు నాణ్యతపై ప్రభావం చూపింది. దేశంలోని నాణ్యమైన ప్రతిభ, గుంటూరు రకాన్ని పండించే రైతులకు క్వింటాల్ కు ధర రూ.5 వేలు లోపు పలుకడం కుదేలును చేసింది. రాష్ట్రంలో అత్యధికంగా పసుపు పండించే ప్రాంతంగా నిజామాబాద్ జిల్లాకు పేరుంది. ఇప్పటి వరకు ఈ యేడాది ఈ సీజన్ లో రూ.15 వేలు క్వింటాళ్ల పసుపు మాత్రమే మార్కెట్ రావడం గమనార్హం. ఇటీవల నిజామాబాద్ కు చెందిన ఒక రైలు వ్యాగన్ లో ముంబాయికి తరలించిన పసుపు ధర క్వింటాళ్ కు రూ.6500 పలుకడమే పసుపు ధర దీనస్థితికి నిదర్శనంగా చెప్పవచ్చు.

ఉత్తర తెలంగాణలో అత్యధికంగా పసుపు పండే ప్రాంతంగా నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాలు ప్రసిద్ది గాంచాయి. మొన్నటి వరకు ప్రతి యేడాది సుమారు 66 వేల ఎకరాల్లో పసుపును పండించే వారు అయితే పసుపు ధర తగ్గడం, ఎగుమతులు లేకపోవడం, మార్కెట్లో డిమాండ్ లేకపోవడం లాంటివి కారణాలతో ఈ యేడాది పసుపును 18,388 ఎకరాల్లో పసుపును విత్తలేదని కేవలం 48 వేల ఎకరాల్లో పసుపు పంట సాగు జరిగిందని వ్యవసాయ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ప్రతియేడాది 8 లక్షల 70 వేల పసుపు బస్తాల దిగుబడి వచ్చేది. గతేడాది 8 లక్షల 55 వేల దిగుబడి రాగా ఈ సారి 4.87 లక్షల బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

గతయేడాది కురిసిన భారీ వర్షాలకుతో పసుపు పంటను ఆశించిన దుంపకుళ్లు తెగులు కారణంగా ఆశించిన దిగుబడి రాలేదని చెబుతున్నారు. 9 నెలల పంటలో ఈసారి 30 శాతం దిగుబడి తగ్గిందని చర్చ జరుగుతుంది. ఒకవైపు దిగుబడి తగ్గగ రైతులకు పసుపు ధర లేకపోవడం దిగాలు పట్టుకుంది. ఒకప్పుడు క్వింటాల్ కు రూ.10వేల పైచిలుకు మొదలుకుని 18 వేల వరకు పలికిన పసుపుధర తగ్గిపోవడంతో రైతులు పసుపు పంటను నాటే విషయంలో సంశయం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని పసుపు వ్యాపారులు సుమారు 4 లక్షల బస్తాల పసుపును కోల్డ్ స్టోరేజిలో భద్రపరచినట్లు సమాచారం. పసుపునకు మంచి ధర రాకపోవడంతో ఇప్పటికే ఉన్న పాత స్టాక్ ను విక్రయించడం లేదని అందుకే కొత్త పసుపు ధర లేదని చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో పసుపు ధర లేకపోవడంతో రైతులు ప్రతిసారి మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ వైపు నజర్ వేసేవారు. అక్కడ పసుపునకు మంచి ధర వస్తుందని దశాబ్ధాలుగా రైతుల నమ్మకం. కానీ ఈసారి పసుపునకు యూరోప్ లో డిమాండ్ లేకపోవడంతోనే ఎగుమతులు లేవని ఎక్స్ పర్ట్ లు చెబుతున్నారు. అంతేగాకుండా నిజామాబాద్ సరిహద్దులోని మహారాష్ట్రలోని బస్మత్, నాందేడ్, హింగోలి ప్రాంతాల్లో పసుపు పండించే రైతులు పెరిగారని చెబుతున్నారు. అక్కడే పసుపు ఎక్కువగా పండడంతో తెలంగాణ పసుపునకు డిమాండ్ లేకుండాపోయిందనే చర్చ కూడా జరుగుతుంది.

తెలంగాణ పసుపునకు మహారాష్ట్రలో డిమాండ్ లేకపోవడంతో వాటిని ఎలా భద్రపర్చాలి, రైతుకు మంచి ధర వచ్చే వరకు ఎలా విక్రయించుకోవాలన్న సౌకర్యాల లేమి స్పష్టంగా కనబడుతుంది. ప్రతి సీజన్ లో 50 లక్షల బస్తాలు మార్కెట్ కు వస్తుండగా ఫిబ్రవరిలోనూ ఈ పరిస్థితి ఉంటే మార్కెట్ పది లక్షల బస్తాల రావడమన్నది తగ్గే అవకాశాలున్నాయి మార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ ఫీజు సైతం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ అధికారులు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ ప్రాంత రైతులకు పచ్చి పసుపు తీసుకురావద్దని ప్రచారం చేస్తున్నారు. రైతులు తీసుకువచ్చే పసుపునకు ధర లేకపోవడంతో ధర పెరిగినప్పుడు తీసుకురావాలనే ఆలోచనలోనూ పసుపు రైతులు ఉన్నారు.

Tags:    

Similar News