ఐరన్ షాపుల్లో నయా జీరో దందా

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికారుల కన్నుగప్పి సలాక దుకాణాల యజమానులు ఎలాంటి వే బిల్లులు లేకుండా దర్జాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి జీరో మాల్ సలాకాను డంప్ చేస్తున్నారు.

Update: 2024-02-17 11:52 GMT

దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికారుల కన్నుగప్పి సలాక దుకాణాల యజమానులు ఎలాంటి వే బిల్లులు లేకుండా దర్జాగా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి జీరో మాల్ సలాకాను డంప్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతుంది. నిత్యం కామారెడ్డి జిల్లా కేంద్రానికి సుమారు పది లారీల వరకు ఒక్కో లారీలో 10 నుంచి 12 టన్నుల సలాక దిగుమతి అవుతుంది. ప్రతినిత్యం జిల్లా కేంద్రంలో సుమారు 40 సలక దుకాణాల్లో జీరో మాల్ దిగుమతి అవుతుందంటే ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

జీరో వ్యాపారం ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ జిల్లా కేంద్రంలోని అధికారులకు కనిపించకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సరైన కాగితాలు లేకుండానే లారీల్లో జీరో మాల్ సలాకను తరలిస్తున్నప్పటికీ చెక్ పోస్ట్‌లలో తనిఖీల్లో పట్టుబడటం లేదంటే చెక్ పోస్ట్ అధికారుల పనితీరు అర్థమవుతోంది. వారి కన్నుగప్పి జిల్లా కేంద్రంలోకి జీరో మాల్ వస్తుందా, లేక వారి అండదండలతోనే వ్యాపారం సాగుతుందా అనేది ప్రశ్నగానే ఉంది. ఈ దందా కమర్షియల్ టాక్స్ అధికారులకు సంబంధం లేకుండా స్టీల్ దుకాణాల వ్యాపారులు బిజినెస్ కొనసాగిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదని పలువురు బాహటంగానే పేర్కొంటున్నారు.

క్వింటాలు సలాక 5500 నుంచి 7000 రూపాయల వరకు విక్రయిస్తున్నారంటే ప్రతిరోజు ఒక్కో దుకాణానికి 10 నుంచి 15 టన్నుల సలాక దిగుమతి అవుతుంది. జిల్లా కేంద్రంలో సుమారు 40 సలాక దుకాణాలు ఉండగా వీటన్నింటిలో కలిపి ఎన్ని టన్నుల సలాక దిగుమతి అవుతుంది, ఎంత పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం గండి పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు జీరో మాల్ వ్యాపారం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్నా చూసి చూడనట్టుగా కమర్షియల్ టాక్స్ అధికారులు వ్యవహరిస్తుండడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదుతోనే సలాక దుకాణంపై ఏసీటీవో దాడి

కామారెడ్డి జిల్లా కేంద్రం అడ్డాగా జరుగుతున్న సలాక జీరో వ్యాపారం పై అధికారులకు కొంతమంది ఫిర్యాదులు చేయడంతో స్పందించిన అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రవికుమార్ శుక్రవారం దాడి చేశారు. కామారెడ్డి విద్యానగర్ కాలనీలో గల ఓం స్టీల్ సలాక దుకాణానికి ఎలాంటి వే బిల్లులు లేకుండా జీరో మాల్ ఐరన్ వచ్చిందని గుర్తించి కేసు రాశారు. జీరో మాల్ ఐరన్‌ను తీసుకువచ్చిన (ఏపీ 23 టి 4595) లారీ శంకరంపేట నుంచి 10 టన్నుల సలాకను డంప్ చేస్తుండగా పట్టుకున్నారు. ఈ సలాక విలువ సుమారు 5,50,000 వరకు ఉంటుందని అంటున్నారు. అయితే సలాకను తీసుకువచ్చిన లారీకి ఎలాంటి కాగితాలు లేకపోవడం శోచనీయం.

మరిన్ని దాడులు జరిగేనా..

కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఎలాంటి వే బిల్లులు లేకుండా నడుస్తున్న జీరో మాల్ సలాక (స్టీల్) వ్యాపార దుకాణాలపై కమర్షియల్ టాక్స్ అధికారుల దాడులు మరిన్ని జరిగేనా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. శుక్రవారం ప్రజల ఫిర్యాదుతో స్పందించిన కమర్షియల్ టాక్స్ అధికారులు దాడి చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. కామారెడ్డిలో సుమారు 40 స్టీల్ దుకాణాలు ఉన్నాయని, వీటిలో చాలావరకు జీరో మాల్ దందా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజు లారీల్లో వందలాది టన్నుల సలక అధికారుల కన్నుగప్పి వస్తున్నట్లు సమాచారం.

కోట్ల రూపాయల్లో జీరో వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారుల కన్నుగప్పి ఈ వ్యాపారం కొనసాగుతుందంటే నమ్మశక్యంగా లేదని పలువురు పేర్కొంటున్నారు. అధికారుల సహకారం వల్లనే ఈ వ్యాపారం యదేచ్చగా సాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఎలాంటి వాహన కాగితాలు లేకుండానే యదేచ్చగా లారీలు చెక్ పోస్టులను దాటి కామారెడ్డికి వస్తున్నాయంటే అధికారుల సహకారం లేనిదే వస్తున్నాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


Similar News