గోదాముల్లో వడ్లను అమ్ముకునే వారిని వదిలేది లేదు.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని అమ్ముకున్న ఎవ్వరిని వదిలిపెట్టబోమని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు.

Update: 2023-12-18 16:24 GMT

దిశ, బోధన్ : ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని అమ్ముకున్న ఎవ్వరిని వదిలిపెట్టబోమని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకోవడం వలన సామాన్య జనం నష్టపోయారని, అధికారులు, సీఎం కేసీఆర్ లకు ఎలాంటి నష్టం లేదని, అధికార యంత్రాంగం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. గెలిచిన తరువాత మొదటిసారి బోధన్ కు విచ్చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. రవి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని నవీపేట, రెంజల్, బోధన్, ఎడపల్లి సాలూర, బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సన్మానం ఏర్పాటు చేశారు. పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా బోధన్ ఇరిగేషన్ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని అడ్డగోలుగా అమ్ముకున్నారని చూసే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకోవడం వల్ల కేసీఆర్ కి, అధికారులకు ఏం కాదని నష్టపోయేది ప్రజలు అని ఆవేదన వ్యక్తం చేశారు. గోదాముల్లో ఉన్న వడ్లను అమ్ముకున్న వారిని వారికి సహకరించిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారని ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోవాలన్నారు.

గత ప్రభుత్వంలో విద్యా, వైద్యం ఇతర అన్ని రంగాలు నిర్లక్ష్యాన్ని గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ప్రారంభిస్తామని చెరుకు రైతులు చెరుకు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. నడుస్తున్న నిజాం షుగర్స్ కర్మాగారాన్ని మూత పెట్టిన దౌర్భాగ్యపు పాలకులు బీఆర్ఎస్ నేతలు అని మండిపడ్డారు. 500 కోట్ల రూపాయల బాకీలు అయ్యాయని ఏదో ఒకటి చేసి సెటిల్మెంట్ పూర్తి చేస్తామన్నారు. ఇరిగేషన్ అధికారులు నిజాంసాగర్ నీటి విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని వర్షాకాలం వచ్చే వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. ఎక్సైజు, పోలీస్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని గంజాయి ఇతర మత్తుపదార్థాలను విక్రయించిన రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఇటీవల గాలులకు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని వాటన్నింటిని మరమ్మతులు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి, పాషా, మోయినుద్దీన్, గౌసుద్దీన్, హరికాంత్ చారి, సంజీవరెడ్డి, నాగేశ్వరరావు, గణపతి రెడ్డి, నరేందర్ రెడ్డి, మందన్న రవి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News