తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు

తాగునీటి సరఫరాలో ఎక్కడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు.

Update: 2024-04-04 14:43 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తాగునీటి సరఫరాలో ఎక్కడా ప్రజలకు ఏ చిన్నపాటి ఇబ్బంది తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి తాగునీటి సరఫరా తీరుతెన్నులపై మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు, ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితి గురించి సంబంధిత అధికారులు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి శరత్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని అన్నారు.

    దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా తీరును అనునిత్యం క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే అనుమతుల కోసం వేచి చూడకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. అవసరమైన చోట చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్ లైన్ ల మరమ్మతులు వంటివి సకాలంలో చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలోని 33 మండలాలు, నాలుగు మున్సిపల్ పట్టణాలలో 792 నివాస ప్రాంతాలు ఉండగా,

     వాటిలో 37 నివాస ప్రాంతాలలో నీటి కొరతను గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత వేసవి సీజన్ దృష్ట్యా మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు కూడా సెలవులు రద్దు చేస్తున్నామని, ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున ఇప్పటికే ఎంపీడీఓలు, తహసీల్దార్లకు సెలవులు రద్దు చేయబడ్డాయని కలెక్టర్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Similar News