ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో పదవుల సందడి

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దక్కినట్లే దక్కిన నామినేటెడ్ కార్పొరేషన్ పదవులపై ఉన్న సందిగ్ధం తొలగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో 34 కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసిన విషయం తెల్సిందే.

Update: 2024-07-09 06:32 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దక్కినట్లే దక్కిన నామినేటెడ్ కార్పొరేషన్ పదవులపై ఉన్న సందిగ్ధం తొలగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో 34 కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసిన విషయం తెల్సిందే. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు 4 కార్పొరేషన్ పదవులు, ఒక నామినేటెడ్ పదవులు దక్కిన విషయం తెల్సిందే. అయితే ఎంపీ ఎన్నికల కోడ్ రావడంతో అప్పటి వరకు భర్తీ చేసిన కార్పొరేషన్ పదవులపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ప్రకటన జారీకి ముందే ఎన్నికల కోడ్ రావడంతో వారి నియామకం చెల్లుతుందా లేదా అన్న ప్రచారం జరిగింది. పేరుకు జాబితా బయటకు వచ్చిన ఎవరు కూడా పదవి బాధ్యతలు స్వీకరించకపోవడంతో పేరుకే కార్పొరేషన్ పదవులు దక్కినట్లయింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ కు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ గా, రాష్ట్ర కిసాన్ ఖేత్ అధ్యక్షుడు సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, బాన్సువాడ కు చెందిన నియోజకవర్గ ఇంచార్జి కాసుల బాలరాజ్‌కు అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా అనాడు పదవులు ఖరారైన విషయం తెల్సిందే.

ఎన్నికల కోడ్ రావడంతో సంబంధిత పదవులలో వారు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. అంతేగాకుండా ఆనాడు పదవులు దక్కని కొందరు నాయకులు పదవుల కోసం నేతల చుట్టూ చక్కర్లు కొట్టారు. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రకారం కార్పొరేషన్, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటాయని మార్చి మాసంలో నియామకమైన పలువురి కార్పొరేషన్ మార్పిడి తప్పదన్న ప్రచారం జరిగింది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం బీజేపీ గెలుచుకోగా, జహీరాబాద్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ ఖాతాలో జమ అయింది. అయితే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైన పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచిన బీజేపీ అభ్యర్థి కంటే మెజారిటీ ఓట్లు లభించాయి. కానీ గతంలో మూడు కార్పొరేషన్ పదవులు బాల్కొండకు కేటాయించినప్పటికీ అక్కడ కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం కావడంతో వారికి ఇచ్చిన పదవులు దక్కుతాయా లేదానన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రకారం పదవుల కేటాయింపు శాఖల మార్పిడి ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో ఫలితాలు మిశ్రమంగా వెలువడడంతో అందరిలో భయం పట్టుకుంది.

బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీకి అక్కడ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా మొదటి స్థానంలో మెజారిటీ ఓట్లు రావడం తో కాసుల బాలరాజ్‌కు ఇబ్బంది ఉండదనే చర్చ జరిగింది. అదే మాదిరిగా బాల్కొండలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం కావడంతో అక్కడ ముగ్గురు నేతలకు కీలక కార్పొరేషన్ పదవులు దక్కగా అక్కడ ఫలితాలు తారుమారు కావడంతో ఎవరికి పదవికి ఎసరు వస్తుందోనన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో జిల్లాకు చెందిన కొందరు సీనియర్ నేతలు తమకు కార్పొరేషన్ పదవులు కావాలని, నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ అగ్రనేతలపై ఒత్తిడి తెచ్చారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సోమవారం మరోసారి గతంలో ప్రకటించిన జాబితాను ఫైనల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ గెజిట్ విడుదల కావడంతో కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కిన అనుచరుల్లో సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో వారి అనుచరులు సంబరాలు చేసుకున్నారు. రేపోమాపో లేదా శ్రావణమాసంలో పదవి బాధ్యతలు తీసుకుంటామని ప్రకటించారు. వారికి అనుకూలంగా ఉన్న జాతకాల ప్రకారం పదవి స్వీకరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పదవులు దక్కని వారు మరోసారి టీపీసీసీ, సీఎం, ఎఐసిసి పెద్దలను కలిసి తాము కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తుంచుకోవాలని పదవులు కేటాయించాలని కోరుతున్నారు. మరో జాబితాలో జిల్లాకు చెందిన మరో ఇద్దరి పేర్లు ఉండడం ఖాయమని పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి.


Similar News