సర్పంచ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

డబుల్ బెడ్ రూంలు ఇంకా మంజూరు చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు పెట్రోల్ తో దాడి చేసి గ్రామ పంచాయతీకి నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్( రైల్వే స్టేషన్) లో సంచలనం సృష్టించింది.

Update: 2023-12-19 10:53 GMT

దిశ, భిక్కనూరు : డబుల్ బెడ్ రూంలు ఇంకా మంజూరు చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ యువకుడు పెట్రోల్ తో దాడి చేసి గ్రామ పంచాయతీకి నిప్పు పెట్టిన సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్( రైల్వే స్టేషన్) లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గంధం రంజిత్ అనే యువకుడు తనకు డబుల్ బెడ్ రూం ఇంకా మంజూరు చేయరా అంటూ గ్రామ సర్పంచ్ జనగామ శ్రీనివాస్ తో ఉదయం నుండి వాగ్వాదానికి దిగాడు. గ్రామానికి 8 మంది లబ్ధిదారులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రభుత్వం అలాట్ చేయగానే నీకు డబుల్ బెడ్ రూం వస్తుందని సర్పంచ్ ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకుండా బూతు మాటలు తిడుతూ దాదాపు రెండు గంటల పాటు సర్పంచ్​తో గొడవ పెట్టుకున్నాడు. డబుల్ బెడ్ రూం మంజూరు విషయమై అవుట్ స్పీకర్ పెట్టి ఇప్పుడే తహసీల్దార్ శివప్రసాద్ తో ఫోన్ మాట్లాడతానంటూ సర్పంచ్ శ్రీనివాస్ ఫోన్ కలిపారు.

    వారం రోజుల్లో డబుల్ బెడ్ రూంలు అలాట్ అవుతాయని తహసీల్దార్​ చెప్పిన విషయాన్ని సర్పంచ్ శ్రీనివాస్ వినిపించినప్పటికీ, ఎవడు చెప్తే నాకేంటి.. ఎన్ని రోజులు గుడిసెలో ఉండాలంటూ నోటి కి వచ్చినట్లు బూతు పురాణం మొదలుపెట్టాడు. ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో, సర్పంచ్ శ్రీనివాస్ సైలెంట్ గా ఉండిపోయాడు. దీంతో సదర్ గంధం రంజిత్ గ్రామ పంచాయతీపై పెట్రోల్ పోసి నిప్పు అంటిస్తానంటూ బెదిరించాడు. వాళ్లు అలాట్ చేయకపోతే నేనేం చెయ్యాలి అంటూ సర్పంచ్ శ్రీనివాస్ అనగా, నీ ఇష్టం ఉన్నట్లు చేసుకోపో అనడమే ఆలస్యం వెంటనే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ తీసుకొని వచ్చి ముందుగా సీట్లో కూర్చున్న సర్పంచ్ పై, గ్రామ పంచాయతీలోని ఫైళ్లపై, పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు. ఒక్కసారిగా కార్యాలయంలో మంటలు

    చెలరేగడంతో సర్పంచ్ శ్రీనివాస్ తో పాటు అక్కడే ఉన్న వీడీసీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్, ప్రభాకర్ పంతులు తప్పించుకోగా, కార్యాలయంలో ఉన్న ఉప సర్పంచ్ కూర్చితోపాటు టేబుళ్లు,ఫైల్స్ కు నిప్పు అంటుకుంది. ఇది గమనించిన గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక యువకులు టేబుళ్లను ఫైళ్లను బయటకు తీసుకువచ్చి వాటిపై నీళ్లు పోసి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎప్పటికైనా సర్పంచ్ ను చంపేస్తానని బెదిరించడంతో సర్పంచ్ తో పాటు వీడీసీ చైర్మన్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


Similar News