ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలి.. కలెక్టర్
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపిస్తున్న మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. బోధన్ పట్టణంతో పాటు, రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేయర్లు ఇంటింటికీ తిరుగుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్జీదారుల వివరాలను సేకరిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్, వారికి సూచనలు చేశారు.
రోజుకు ఎన్ని కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారు ? సర్వే సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా ? అని ఆరా తీశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, పొరపాట్లకు తావులేకుండా దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ మొబైల్ యాప్ లో జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. ఈ నెలాఖరులోగా నూటికి నూరు శాతం సర్వేపూర్తి అయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. శిథిలావస్థకు చేరిన పాతకాలం నాటి ఇళ్లలో నివాసం ఉంటున్న వారు. ఎవరైనా వాటి స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు ముందుకు వస్తే, అలాంటి వారి వివరాలను కూడా పూర్తిస్థాయిలో సేకరించి సర్వే యాప్ లో పొందుపర్చాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్న దృష్ట్యా, దరఖాస్తుదారుల వివరాల నమోదులో పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు పాటించాలని హితవు పలికారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలోని వారు వార్డు అధికారిని, గ్రామాల్లో ఉండే వారు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించవచ్చని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, రుద్రూర్ ఎంపీడీఓ సురేష్ బాబు తదితరులు ఉన్నారు.