నిజామాబాద్ అర్బన్లో సంకుల సమరం

నిజామాబాద్ అర్బన్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న కుల సంఘాల ఎన్నికలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి.

Update: 2023-04-02 03:20 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ లో ఇటీవల కాలంలో జరుగుతున్న కుల సంఘాల ఎన్నికలు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. కుల సంఘాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తలదూర్చుతున్నాయి. రాబోయేది జనరల్ ఎలక్షన్ సీజన్ కావడంతో కచ్చితంగా గెలువాలంటే కుల సంఘాల మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆయా కుల సంఘాలలో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని ఆయా ఎలక్షన్ ప్యానల్ లలో తమ వర్గం వారిని గెలిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ లో ప్రధానంగా మున్నూరు కాపు, పద్మశాలి, వైశ్య, వంజరి, ముదిరాజ్, ఎస్సీ కులాల వారు అధికంగా ఉంటారు. వారిని ఎన్నికల నాటికి మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే కసరత్తు మొదలైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉండే ప్రధాన సంఘం ద్వారా జిల్లా కార్యవర్గంతో పాటు నగర కార్యవర్గం ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

గతేడాదిలో నిజామా బాద్ అర్బన్ బీఆర్ఎస్ టికెట్ ను ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ, స్టేట్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత మున్నూరు కాపుల సమీకరణకు కసరత్తుతో రాజకీయ వేడి అంటుకుంది. దాంతో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త సైతం మున్నూరు కాపుల ఆధ్వర్యంలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో మున్నూరు కాపులో ఉన్న గ్రూప్ లు బహిర్గతమయ్యాయి. అక్కడ ఇప్పుడైతే ఎన్నికల హడావుడి లేకపోయినప్పటికీ ఇప్పటికే పెద్ద సంఘంలో ధర్మపురి శ్రీనివాస్, సంజయ్ ల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు బాజిరెడ్డి అక్కడ ప్రయత్నించడంతో మున్నూరు కాపు సంఘాలలో ఎన్నికల వాతావరణం షురూ అయిందని చెప్పాలి. ఇటీవల జరిగిన పద్మశాలి సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన ప్యానల్ ఓటమి చెందింది. దానిని మరువకముందే వంజరి సంఘం ఎన్నికల్లోనూ అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పద్మశాలి, వంజరి సంఘం ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అనుకూలమైన వ్యక్తులు గెలుపొందారు.

నిజామాబాద్ లో జనాభా పరంగా మూడవ స్థానంలో ఉన్న వైశ్య సంఘం ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. దాదాపు పుష్కరకాలం తర్వాత జరుగుతున్న ఎన్నికలు రాజకీయ ఎలక్షన్ ను మరిపిస్తున్నాయి. రెండు గ్రూప్ లకు సంబంధించిన వ్యక్తులు బరిలో ఉండగా గత నెల రోజుల కాలంలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంఘం ఆస్తులు కాజేశారని ఒక వర్గం, ఏకంగ రికార్డులు చోరి చేశారని మరో వర్గం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ లలో పరస్పర ఫిర్యాదులతో పాటు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.

దాదాపు 16 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో నగర ఆర్యవైశ్య సంఘం ఎన్నికలతో పాటు వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం పాలకవర్గం కోసం జరుగుతున్న ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన వారు బరిలో నిల్చుండడంతో ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను ప్రయోగిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు కామెంట్లకు కొదవ లేదు. ఆదివారం ఎలక్షన్ ఉండగా శనివారం ఏకంగా ఒకరిపై ఒకరు కరపత్రాలను ముద్రించి పంపిణీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అధికార బీఆర్ఎస్, బీజేపీ నేతల అనుచరవర్గం బరిలో ఉండటంతో పోటి నువ్వా నేనా అన్నట్లు సాగుతుందని చెప్పాలి.

Tags:    

Similar News