గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన ఆర్మూర్ వాసులు.. ఇండియాకు రప్పించాలంటూ ఆవేదన

Update: 2024-09-27 17:00 GMT

దిశ , నిజామాబాద్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోచమ్మగల్లికి చెందిన షేర్ రాజ్ కుమార్, పుప్పాల వినోద్ కుమార్ లు గల్ఫ్ ఏజెంట్ బూర్ల బాలు చేతిలో మోసపోయి గల్ఫ్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 22న గల్ఫ్ ఏజెంట్ బూర్ల బాలు ఆర్మూర్ కు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని సౌదీ అరేబియాకు పంపించాడు. ఒక్కొక్కరి వద్ద రూ. 2,50,000ల చొప్పున మొత్తం రూ. 5,00,000లు తీసుకున్నాడు గల్ఫ్ ఏజెంట్ బూర్ల బాలు. అయితే.. గల్ఫ్ లో ఉపాధి పొందేందుకు సౌదీ అరేబియాకు వెళ్లిన ఇద్దరు ఆర్మూర్ వాసులకు, 15 నెలలు అకామా(ఆజాద్ వీసా)చేసి ఇప్పిస్తానని ఇవ్వకుండా గల్ఫ్ ఏజెంట్ బూర్ల బాలు మోసం చేశాడని ఫోన్ సంభాషణలో వారి బాధను వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాకు వెళ్లిన తర్వాత ఆర్మూర్ వాసులకు 3నెలల అకామా(ఆజాద్ వీసా)ను ఆ దేశంలోని కపిల్ ఈనెల 25వ తేదీన ఇచ్చినట్లు బాధితులు చెప్పారు. కాగా.. గల్ఫ్ ఏజెంట్ చెప్పిన ప్రకారం ఇప్పుడు 15 నెలల అకామా (ఆజాద్ వీసా) కావాలని అడిగితే.. మళ్లీ డబ్బులు కట్టాలని వేదిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్మూర్ గల్ఫ్ బాధితులు. అంతేకాకుండా.. తమను ఇండియాకు పంపాలని సౌదీ అరేబియా దేశంలో గల కపిల్ ను వేడుకున్నా.. కపిల్ పంపించడం లేదని గల్ఫ్ బాధితులు మొరపెట్టుకుంటున్నారు.

ఎలాగైనా తమను ఇండియాకు రప్పించాలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు చొరవ చూపి, తమను ఆర్మూర్ కు రప్పించాలని వేడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన గల్ఫ్ ఏజెంట్ బూర్ల బాలు సౌదీ అరేబియాలో అక్రమ పద్ధతిలో థాయిలాండ్ (మట్కా) గేమింగ్ క్రీడను నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గల్ఫ్ దేశంలో ఉన్న ఆర్మూర్ వాసుల సంగతి కపిల్ చూసుకుంటాడని, గల్ఫ్ దేశంలో ఉన్న పలువురితో గల్ఫ్ ఏజెంట్ బూర్ల బాలు మాట్లాడిన ఆడియో ఇప్పుడు ఆర్మూర్ సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది.


Similar News