బాలిక పై అత్యాచారం హత్య.. నిందితునికి రెండు జీవిత ఖైదు..
ఐదు సంవత్సరాల బాలిక పై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారకుడైన వ్యక్తికి రెండు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు, ఇంచార్జి ఫోక్సో కోర్టు జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు వెలువరించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఐదు సంవత్సరాల బాలిక పై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారకుడైన వ్యక్తికి రెండు జీవిత ఖైదుల శిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు, ఇంచార్జి ఫోక్సో కోర్టు జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు వెలువరించారు. పూర్తివివరాల్లోకెళితే 2022 అక్టోబర్ 20న డిచ్ పల్లి మండల ధర్మారంలో వ్యవసాయ పొలంలో పనిచేసే మహిళ కూతురు అనుమానాస్పదంగా చనిపోయింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిచ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి కామారెడ్డి జిల్లా పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్ రావు అనే వ్యక్తిని విచారించగా తానే బాలిక పై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారకుడైనట్లు గుర్తించి కేసునమోదు చేసి రిమాండ్ తరలించారు.
దేవకత్తె గోవింద్ రావు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లినప్పుడు అతనికి డిచ్ పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత పరిచయమైంది. అతడికి వివాహమై ఒక కొడుకు ఉండగా, సదరు మహిళకు కూడా వివాహమై ఇద్దరు పిల్లలు భర్త ఉన్నారు. అక్కడ పనిచేసే సమయంలో సదరు వివాహితతో గోవింద్ రావుతో ఏర్పడిన పరిచయమై వివాహేతర సంబంధానికి దారి తీసింది. దాంతో వారు ఇరువురు ఇద్దరు పిల్లలతో కలిసి డిచ్ పల్లి మండలం ధర్మారంకు ఉపాధి నిమిత్తం వలస వచ్చారు. అక్కడ పనిచేస్తూ ఇద్దరు వివాహం చేసుకున్నారు. తమకు అడ్డుగా ఉందని తన సవతి కూతురు అయిన 5 సంవత్సరాల బాలికను వైద్యం చేయిస్తానన్న నేపంతో పక్కన ఉన్న ఓ గ్రామానికి తీసుకెళ్లాడు గోవిందరావు. అక్కడ వైద్యం చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో వ్యవసాయం పోలాల వద్ద బాలిక పై అత్యాచారం చేశాడు.
బాలిక కేకలు వేయడంతో ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. బాలిక తీవ్రఅస్వస్థతో ఉండగా ఇంటికి తీసుకువచ్చాడు. అనుమానంతో తన కూతురిని ఏమి చేశావని బాలిక తల్లి గోవింద్ రావును నిలదీసింది. ఇరువురు కలిసి బాలికను నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడ వైద్యులు వైద్యం చేయడానికి నిరాకరించడంతో హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక చనిపోయింది. బాలిక పై అత్యాచారం చేసినందుకు గోవింద్ రావుకు ఒక జీవిత ఖైదు, ఆమె మరణానికి కారణమైనందుకు రెండవ జీవిత ఖైదును విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సునిత కుంచాల తీర్పు వెలువరించారు. రెండు కేసులలో కలిపి పది వేల జరిమానా చెల్లించాలని లేనియెడల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.
బాలిక కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల పరిహారం..
మైనర్ బాలిక పై జరిగిన అత్యాచారంతో పాటు ఆమె మరణానికి కారణమైన కేసుపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ పరిహారం ప్రకటించింది. శనివారం ఈ కేసులో నిందితుడికి రెండు జీవిత ఖైదులు విధించిన జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సునీతా కుంచాల రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. బాలిక తల్లికి సంబంధిత మొత్తాన్ని చెల్లించి ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.