గడువులోపు ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా ఓటరు జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం నుండి పరిశీలకులుగా విచ్చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా ఓటరు జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం నుండి పరిశీలకులుగా విచ్చేసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి గురువారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ, ఇంటింటి సర్వే, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ ఏర్పాట్లు, స్వీప్ కార్యకలాపాలు, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, దాఖలైన దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలలో నియోజకవర్గాల వారీగా ప్రగతిని సమీక్షిస్తూ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈనెల 26తో గడువు ముగియనున్న దృష్ట్యా ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని, వందశాతం సర్వే పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఇప్పటికే సర్వే పూర్తి చేసిన బీఎల్ఓలను అవసరం ఉన్న చోట ఇతర పోలింగ్ కేంద్రాలలో సర్వే కోసం సర్దుబాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి తిరుగుతూ జాబితాను సరిచేయాలని, మరణించిన వారి పేర్లు తొలగించాలని, పేర్లు, చిరునామాలు వంటివి ఏవైనా మార్పులు ఉంటే పక్కాగా నిర్ధారణ చేసుకుని బీఎల్ఓ యాప్ ద్వారా మార్చాలని సూచించారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపి, ఐటీ టూల్స్ ద్వారా సరి చేయాలన్నారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసే సమయానికే ఓటరు సవరణ జాబితా సమగ్రంగా రూపొందించబడితే తదుపరి అభ్యంతరాలకు అంతగా ఆస్కారం ఉండదని అన్నారు.
ప్రతి ఓటరుకు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటు హక్కు ఉంది అనే వివరాలు తప్పనిసరిగా తెలిసేలా బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లతో అవగాహన కల్పించేలా చూడాలన్నారు. ఓటర్లలో చైతన్యం పెంపొందించేందుకు స్వీప్ యాక్టివిటీస్ ద్వారా విద్యా సంస్థలు, సామాజిక మాద్యమాలు, బస్టాండులు తదితర రద్దీ ప్రదేశాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇంటింటి సర్వేకు వెళ్లిన సమయంలో ఎస్ఎస్ఆర్-2025 అని మార్కింగ్ చేయించాలన్నారు. 15 వందల ఓటర్లు దాటిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అలాంటి చోట కొత్తగా మరొక కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలైతే ఒకే ప్రదేశంలో రెండుకు మించి పోలింగ్ స్టేషన్లు ఉండకూడదని, పట్టణ ప్రాంతాల్లో 4 పీఎస్ లకు మించి ఒకే లొకేషన్ లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో ఫొటో, చిరునామా సరిగా ఉందా లేదా అన్నది ఒకటికి రెండు పర్యాయాలు క్రాస్ చెక్ చేసుకోవాలని, ఒక కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, కాంపౌండ్ వాల్ తదితర వసతులు సరిగా ఉన్నాయా లేదా అన్నది ముందుగానే పరిశీలించుకోవాలని కోరారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్ధవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఎన్నికల విభాగం కు సంబంధించిన రిజిస్టర్లు సక్రమంగా మెయింటైన్ చేస్తూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా కార్యకలాపాలు నిర్వహించాలని, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ ఎస్ఎస్ఆర్-2025 కార్యక్రమాల గురించి వివరించాలని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఓటరు జాబితా సవరణ, స్వీప్ యాక్టివిటీస్, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర వాటికి సంబంధించి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలకులు అబ్దుల్ హమీద్ కు వివరించారు. అనంతరం జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాల పరిధిలో కొనసాగుతున్న ఇంటింటి ఓటరు జాబితా సవరణ తీరును పరిశీలకులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బీఎల్ఓలు, సూపర్వైజర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, బోధన్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతి, కిరణ్మయి, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, సహాయ ఈఆర్ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.