ఐరన్ దందాలో రవాణా శాఖ అధికారుల హస్తం ?

'ఐరన్ షాపుల్లో జోరుగా జీరో దందా' శీర్షికన దిశ పత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది.

Update: 2024-02-18 12:13 GMT

దిశ, కామారెడ్డి : 'ఐరన్ షాపుల్లో జోరుగా జీరో దందా' శీర్షికన దిశ పత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఏ నోట విన్నా దిశలో వచ్చిన వార్తా కథనమే వినిపించింది. జీరో దందాలో వ్యాపారులకు అధికారుల హస్తం మెండుగా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జీరో దందా చేస్తున్న వ్యాపారులకు సంబంధించి వాహనాలు జిల్లా కేంద్రంలోకి యథేచ్ఛగా ఎంట్రీ కావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రవాణా శాఖ అధికారుల అండదండలు లేకుండా కోట్లాది రూపాయల విలువ చేసే ఐరన్ లోడ్ వాహనాలు చెక్ పోస్ట్ దాటి జిల్లా కేంద్రంలోకి ఎంట్రీ కావడం అంత ఈజీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

చెక్ పోస్టులో తనిఖీలు శూన్యం

హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వాహనం పొందుర్తి వద్ద ఉన్న చెక్ పోస్ట్ దాటి కామారెడ్డికి చేరుకోవాల్సి ఉంటుంది. లేదా అడ్డదారిలో బేసిక్ నుంచి దోమకొండ మీదుగా కామారెడ్డికి రావాల్సి ఉంటుంది. అయితే పొందుర్తి చెక్ పోస్టు వద్ద వాహనాల తనిఖీలు పకడ్బందీగా జరుగుతున్నాయా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది చేతిలో డబ్బులు పడగానే వాహనాల తనిఖీలు లేకుండానే పంపిస్తారన్న ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ఎప్పుడో ఒకసారి ఉన్నతాధికారుల పర్యటన సమయంలో తప్ప పకడ్బందీగా తనిఖీలు చేపట్టిన దాఖలాలు శూన్యమనేది బహిరంగ రహస్యమే.

సునాయాసంగా జిల్లా కేంద్రంలోకి ఎంట్రీ

హైదరాబాద్ నుంచి జోరుగా ఐరన్ లోడ్ వాహనాలు జిల్లా కేంద్రంలోకి సునాయాసంగా ఎంట్రీ ఇస్తున్నాయి. వాస్తవానికి హెవీ లోడ్ తో వచ్చే వాహనాలకు సంబంధించి వే బిల్లులు చెక్ పోస్టుల వద్ద అధికారులు పకడ్బందీగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. చెక్ పోస్టు వద్ద వాహనాలు నిలిపివేసి సంబంధిత పత్రాలు చెక్ చేయాలి. అయితే అలాంటి తనిఖీలు ఏమి లేకుండానే దర్జాగా వాహనాలకు జిల్లా కేంద్రంలోకి అనుమతులు ఇస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దాంతో వ్యాపారులకు జీరో దందా చేయడానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి.

మామూళ్లకు అలవాటు పడ్డారా..?

జిల్లా కేంద్రంలోకి వచ్చే వాహనాలను పొందుర్తి చెక్ పోస్టు వద్ద రవాణాశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. పత్రాలన్నీ సరిగా ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాతే వాహనాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చెక్ పోస్టులో అలాంటిదేమీ లేకుండానే వాహనాల రాకపోకలు సాగుతున్నాయని తెలుస్తోంది. చెక్ పోస్టు దాటే క్రమంలో అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారి వాహనాలు,

    ఇతర లారీలు, టిప్పర్లకు సంబంధించిన వాహన డ్రైవర్లు చెక్ పోస్టు వద్దకు వాహనం రాగానే ఎలాంటి పత్రాలు లేకుండా కేవలం నోట్లను పట్టుకుని నేరుగా కార్యాలయంలోకి వెళ్లి నిమిషాల్లోనే అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారని తెలుస్తోంది. ఇలా మామూళ్లకు అలవాటుపడిన అక్కడి అధికారులు, సిబ్బంది సంబంధిత వాహనాలలో ఎలాంటి వస్తువులు తరలించినా చూసే పరిస్థితి ఉండటం లేదన్న ప్రచారం సాగుతోంది. దాంతో పొందుర్తి చెక్ పోస్టుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు

పొందుర్తి చెక్ పోస్టుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న ప్రచారం సాగుతోంది. అక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయని బహిరంగంగానే చర్చ సాగుతోంది. అయినా అధికారులు అటువైపుగా వెళ్లిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఉన్నతాధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేసినప్పుడు అక్కడ ఒక్క వాహనం కూడా నిలిపివేసి ఉండవు. దాంతో అధికారులకు ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగడం లేదని నమ్మిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది

జీరో దందాకు చెక్ పడేనా..?

జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతున్న ఐరన్ జీరో దందా ముడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. అధికారుల తనిఖీలు లేకుండా వ్యాపారులు మచ్చిక చేసుకోవడంలో సఫలం కావడంతో అటువైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదన్న ప్రచారం సాగుతోంది. అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టి కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టుగా అరకొరగా కొంత సరుకు పట్టుకుని చేతులు దులుపుకుంటున్నారు.

    జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల్లో జీరో దందా సాగడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు సీరియస్ గా పరిగణించి ఐరన్ షాపుల్లో వే బిల్లులు, జీఎస్టీ, ఇతరపత్రాలు పకడ్బందీగా తనిఖీలు చేపడితే జీరో దందా బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలా చేస్తే జీరో దందాకు చెక్ పడినట్టే. అయితే అధికారులు నిజాయితీగా, నిష్పక్షపాతంగా తనిఖీలు చేపడతారా అనేది అనుమానమేనని తెలుస్తోంది. అధికారులు ఇకనైనా తనిఖీలపై దృష్టి పెడతారా అనేది వేచి చూడాలి. 


Similar News