పెరుగుతున్న కిట్టి పార్టీల క్రేజ్.. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన కల్చర్

ఫేస్ బుక్.. ఇంస్టాగ్రామ్... వాట్సాప్ గ్రూప్ ల పుణ్యమాని...

Update: 2025-03-15 07:24 GMT

దిశ, భిక్కనూరు : ఫేస్ బుక్.. ఇంస్టాగ్రామ్... వాట్సాప్ గ్రూప్ ల పుణ్యమాని... మహిళల్లో చైతన్యం బాగా వచ్చింది. ఇంకేముంది గ్రూపులుగా ఏర్పడి ఒకరిని చూసి మరొకరు, ఉన్నత, మధ్య, పేద వారి వారి స్థాయిలను బట్టి పోటా పోటీగా కిట్టి పార్టీలు ఏర్పాటు చేసుకుంటూ, తమ లైఫ్ స్టైల్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వారు మారుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మహిళలు. ఇదివరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కిట్టి పార్టీ కల్చర్ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. గత కొద్ది రోజులుగా కిట్టి పార్టీల క్రేజ్ విపరీతంగా పెరిగిపోవడం, నెలనెలా తలా కొంత డబ్బులు పోగు చేసుకొని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చిట్టీలు వేసుకోవడం, బంగారం, సిల్వర్ కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారు.

రిలీఫ్ కోసమే....

పిల్లా పాపలు... బరువు బాధ్యతలు, అనేక రకాల సమస్యలతో బాధపడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మహిళలు కొంతసేపైనా రిలీఫ్ దొరుకుతే బాగుండేదని చాలామంది మహిళలు కోరుకుంటారు. కాని వారికి ప్రశాంతంగా ఉండే ఛాన్స్ దొరకకపోవడం, ఎన్ని రోజులైనా ఈ కష్టాలు, బాధలు బందీలు ఎప్పుడైనా ఉంటాయన్న ఉద్దేశంతో, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడం తో పాటు, పరిచయాలు కూడా పెరుగుతాయన్న భావనతో కిట్టి పార్టీల వైపు విపరీతమైన క్రేజ్ ను పెంచుకుంటున్నారు. ఒక్కటి రెండు గ్రూపుల్లో ఉంటే చాలు అని అనుకుంటూ కొందరు, వారి కుటుంబ సభ్యుల సంపాదనను బట్టి మరికొందరు, ఉద్యోగాలు చేస్తూ, బిజినెస్ లో రాణిస్తున్న మహిళలు పరిమితులు ఏమి పెట్టుకోకుండా, అంతకంటే ఎక్కువ గ్రూప్ లో చేరుతూ, తద్వారా వచ్చే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. కిట్టి పార్టీ అంటే ఎంజాయ్ చేయడమే కాకుండా, ఆ గ్రూప్ లో చేరడం వల్ల నాలుగు డబ్బులు వెనుక వేసుకోవడం, రోజురోజుకు చుక్కల నంటుతున్న బంగారం, వెండిని ఒకేసారి కొనుక్కోవడం కష్టమన్న భావనతో చాలామంది కిట్టి పార్టీలలో సభ్యులుగా చేరితే, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడే బంగారం, వెండిని కొంతలో కొంతైనా జమ చేసుకోవచ్చనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు.

ఆటపాటలతో ఎంజాయ్....

నెల రోజులు, పక్షం రోజులకు ఒకసారి పెట్టుకునే ఈ పార్టీలో అందరూ కలిసి మొదట పిచ్చా పోటీగా ముచ్చటించుకుంటూ భోజనం చేస్తారు. ఆ తరువాత కాస్త విశ్రాంతి తీసుకొని ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, సభ్యుల నుంచి డబ్బులు కలెక్ట్ చేసి, వాటి వివరాలను ఒక బుక్ లో ఎంట్రీ చేస్తారు. సభ్యుల నెంబర్లు వేసి డ్రా తీస్తారు. డ్రాలో ఎవరి పేరున అయితే చీటీ వెళుతుందో, ఆ మహిళ వచ్చే కిట్టి పార్టీని వారికి అనుకూలమైన స్థలంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పలు రకాల వస్తువులతో ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ పోటీలు ఏర్పాటు చేసుకుంటారు. పోటీలలో గెలుపొందిన మహిళలకు వెంటనే బహుమతులు కూడా ప్రధానం చేస్తున్నారు. సభ్యులలో ఎవరి ఇంట్లోనైనా ఫంక్షన్ అయితే, సభ్యులంతా కలిసి జమ చేసిన డబ్బుల్లో నుంచి గిఫ్ట్ లు కూడా పెడతారు.

సేవా కార్యక్రమాలకు కూడా ఖర్చు....

డబ్బు, బంగారం, పోగు చేసుకోవడమే కాదు, అవసరమైతే సేవా కార్యక్రమాలకు సైతం కిట్టి పార్టీల మహిళలు సైతం తమ వంతు సాయం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన చాలామంది మహిళలు కిట్టి పార్టీల నుంచి తీర్థయాత్రలకు కూడా వెళుతుంటారు. మొన్న జరిగిన కుంభమేళాకు సైతం, కుటుంబ సభ్యులతో కలిసి వారం పది రోజుల పాటు వెళ్లొచ్చారు.


Similar News