మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వమే నడిపించాలి

నిజామాబాద్ జిల్లాలో మూతపడిన రెండు చక్కెర ఫ్యాక్టరీలను కొత్త ప్రభుత్వం తెరిపించి నడిపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Update: 2023-12-11 14:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో మూతపడిన రెండు చక్కెర ఫ్యాక్టరీలను కొత్త ప్రభుత్వం తెరిపించి నడిపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐకేఎంఎస్ గౌరవ అధ్యక్షులు నాయక్ వాడి నరసయ్యతో అర్సపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ....గత ప్రభుత్వాల వైఫల్యాలు, రైతుల ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించు కోలేని స్థితిలో బంగారు తెలంగాణ అంటూ మోసం మాటలతో నమ్మించి వేలాది కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న బీఆర్ ఎస్ ను ఓడించి కాంగ్రెస్​కు పట్టం కట్టినట్టు తెలిపారు.

    కొత్త ప్రభుత్వం అనేక సభలలో చక్కెర ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తారని చెప్పారని అన్నారు. ఫ్యాక్టరీలు నడిచిన రోజుల్లో రైతులకు, కార్మికులకు మంచి ఉపాధి లభించిందని తెలిపారు. ఫ్యాక్టరీని తెరిపించాలని గతంలో రైతులు అనేకసార్లు విజ్ఞప్తులు చేసినా, ఆందోళనలు నిర్వహించినా బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించు కోలేదని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో పాదయాత్ర చేసిన సందర్భాలలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీలను తెరిపిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చెరుకు పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణలో సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్సీఎస్ఎఫ్ చెక్కర ఫ్యాక్టరీ పై ఉన్న అప్పులు మాఫీ చేసి ఫ్యాక్టరీని తెరిపించి నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు నరసయ్య, అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, ఉపాధ్యక్షులు.టి. కృష్ణ గౌడ్, అగు ఎర్రన్న, బి.సాయిలు గోపాల్, దండు చిన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News