నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు ఢోకా లేదు

వర్షాకాల ప్రారంభంలో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువలు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందారని, కానీ దేవుడు కరుణించడంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో వానాకాలం పంటలతో పాటు యాసంగికి కూడా ఢోకా లేదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-10 15:29 GMT

దిశ, నిజాంసాగర్ : వర్షాకాల ప్రారంభంలో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువలు లేకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందారని, కానీ దేవుడు కరుణించడంతో ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో వానాకాలం పంటలతో పాటు యాసంగికి కూడా ఢోకా లేదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంసాగర్ ప్రాజెక్టును రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్ తో మాట్లాడి ప్రాజెక్టులోకి వస్తున్న వరదను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో దూరప్రాంతాల నుంచి వందలాది సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని తెలిపారు.

    ప్రాజెక్టు వద్ద మంచినీటి వసతులు, మరుగుదొడ్లు, మూత్రశాలల వసతుల గురించి పర్యాటకులు ఆయన దృష్టికి తీసుకురావడంతో ఇబ్బందులను తీర్చేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే నిధులతో పర్యాటకులకు ఇబ్బందులను తీర్చేలా తగు చర్యలు తీసుకోవాలని, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుతో కూడా మాట్లాడతానని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రాజెక్టు వద్ద పరిశుభ్రంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అనంతరం ప్రాజెక్టు ఒక వరద గేటు ద్వారా మంజీరా నదిలోకి కొనసాగుతున్న 4వేల క్యూసెక్కుల నీటి విడుదలను ఆయన పరిశీలించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ సోలోమాన్, ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, సత్యనారాయణ, చీల శంకర్, నరేందర్ రెడ్డి, బిల్ల రామ్ మోహన్, మదన రవి, ఏఈ శివప్రసాద్ ఉన్నారు. 

Tags:    

Similar News