ప్రజల చేతుల్లోని వజ్రాయుధం... ఓటు

ప్రజల చేతుల్లో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అని రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లు పాలించిన తెలుగుదేశం ,10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీలలో ఎవరి హయాంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరిగిందో పరిణితి చెందిన ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్​ కోరారు.

Update: 2023-11-01 14:46 GMT

దిశ ,ఇల్లందు : ప్రజల చేతుల్లో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అని రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లు పాలించిన తెలుగుదేశం ,10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీలలో ఎవరి హయాంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరిగిందో పరిణితి చెందిన ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్​ కోరారు. ఇల్లందు మండలం మోదుగులగూడెం గ్రామంలో బుధవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఇల్లందు పోరాటాల పురిటి గడ్డ, చైతన్యవంతమైన , ఉద్యమాలు జరిగిన ప్రాంతమన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టింది 10 సంక్షేమ పథకాలు, అమలు చేసింది 100 పథకాలన్నారు. మాటలు చెప్పడం ఎవరికైనా సాధ్యమవుతుందని దాన్ని చేతల్లో చూపించడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చేది కేవలం తెలంగాణ రాష్ట్రం అన్నారు. 1800 కోట్లతో ఇల్లందు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. పోడు వ్యవసాయంపై ఆధారపడి

    జీవనం కొనసాగించే వారందరికీ పోడు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్రంలో మరలా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కొమరారం, బోడు మండలాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రధాని మోడీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని, అన్ని రంగాలను ప్రైవేటుపరం చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయం చేసే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందజేసే రైతుబంధు దండగ అనే కాంగ్రెస్ పార్టీ అనడం సరికాదు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 93 లక్షల రేషన్ కార్డుదారులకు త్వరలో బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మార్చ్ నెల నుండి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య విధానంలో గుణాత్మక మార్పులు రావడం జరిగిందన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని ఈ జన ప్రవాహాన్ని చూస్తుంటే ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థిని బానోత్ హరిప్రియ నాయక్ గెలుపు ఖరారు అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రాజకీయ పరిణితి రావాల్సిన

    అవసరం ఎంతైనా ఉందన్నారు. పైసలతో ప్రలోభాలకు లోను కావద్దని సూచించారు. ఓటు వేసే ముందు కేసీఆర్ చెప్పిన మాటలు అభ్యర్థి పార్టీ దృఢత్వం ఏమిటి అనే చర్చలు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వస్తే మంచి జరుగుతుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5000 కోట్లను రద్దు చేస్తామని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ తన తల తెగిపడినా కానీ మీటర్లు పెట్టనని చెప్పినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మూడు, నాలుగు నెలలు ఎలా అభివృద్ధి చేయాలో మేధావులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వ్యవసాయ స్థిరీకరణ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లో ఎవరి భూములు వారి పేర్లపై ఎలాంటి గోల్మాల్ జరగకుండా నమోదు చేసినట్టు చెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో 15107 మంది పోడు కుటుంబాలకు 48300 ఎకరాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా పోడు వ్యవసాయదారులపై ఉన్న పోలీస్ కేసులను సైతం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి త్రీఫేస్ కరెంటు సరఫరా అవుతుంది అన్నారు. ఇల్లందు నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన రోడ్లు లేకపోవడంతో ఎమ్మెల్యే హరి ప్రియ నాయక్ చొరవతో కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిచేసినట్టు తెలిపారు. సుమారుగా 300 కోట్లతో ఇల్లందు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

     పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మూడు గంటల విద్యుత్ చాలు అనడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని ప్రజలకు నమ్మ పలుకుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తున్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు. రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండుతుందని తెలిపారు. రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వం లో పెన్షన్లు పెంచనున్నట్టు చెప్పారు. రూ 400కే గ్యాస్ అందజేస్తామని, రైతు బీమా ద్వారా లక్షల కుటుంబాలు ఆసరాగా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాల తెల్ల రేషన్ కార్డుదారులు సాధారణ మరణం చెందితే రూ.5 లక్షల బీమా వస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలను బలోపేతం చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలలో గురుకులాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇల్లందు నియోజకవర్గంలో త్వరలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. కాల్వ పూర్తి కాగానే రెండు లిఫ్టులను ఏర్పాటు చేసి రెండు మండలాలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు. ఢిల్లీలో మాకు బాసులు ఎవరు లేరని ప్రజలే

    మా బాసులన్నారు. త్వరలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మీ ప్రాంతానికి వచ్చి ఒకరోజు ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇల్లందు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం అయ్యేందుకు రాజ్యసభ సభ్యులు, ఇల్లందు ఎన్నికల ఇంచార్జీ వద్దిరాజు రవిచంద్ర కృషి ఎంతో ఉందని కొనియాడారు. ఇల్లందు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థిని బానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఆరు దశాబ్దాల కల బస్ డిపో బీఆర్ఎస్ తోనే సాధ్యమైంది అన్నారు. ఇల్లందులో వైద్య పరంగా వంద పడకల హాస్పిటల్ ,డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం గర్వకారణం అన్నారు. 1800 కోట్లతో ఇల్లందు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. రూ 1100 కోట్లతో సంక్షేమ పథకాలు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు లక్షల 14 వేల ఓట్లలో 1,72,000 ఓటర్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,దళిత, బీసీ, మైనార్టీ బంధులు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. సింగరేణి సంస్థకు రూ. 2222 కోట్లు లాభాలు రాగా కార్మికులకు

    వాటా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ చూపాలని కోరారు. ఇల్లందు రైల్వే స్టేషన్ పునః ప్రారంభించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత ,వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, టీబీజీకేఎస్ అధ్యక్షులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, భద్రాద్రి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీ పాషా, బీఆర్ఎస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News