బీజేపీ గెలుపు క్రెడిట్ పార్టీ కార్యకర్తలదే.. ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు క్రెడిట్ పార్టీ కార్యకర్తలకే దక్కుతుందని, ఈ విజయం వారిదేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు.

Update: 2024-07-15 14:40 GMT

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు క్రెడిట్ పార్టీ కార్యకర్తలకే దక్కుతుందని, ఈ విజయం వారిదేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. నగరంలోని శ్రావ్య గార్డెన్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ధన్ పాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే గెలిచినం, ఎంపీ గెలిచినం రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా గెలిచి కాషాయ జెండా ఎగుర వేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని, ఇప్పటి నుంచే కార్యోన్ముఖులు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నగరంలో కార్పొరేటర్ నుండి మేయర్ వరకు అన్నిటిని మనమే గెలవాలన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి కార్యకర్త మరో యుద్దానికి సంసిద్ధులు కావాలని ధన్ పాల్ పిలుపునిచ్చారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేసి ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి 200 రోజులు గడుస్తున్న హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతు డిక్లరేషన్ ప్రకటించి రైతన్నలను కాంగ్రెస్ నిండా ముంచిందన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు, వరి పంటకు బోనస్ రూ. 500 లు రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, సోనియా జన్మదినం డిసెంబర్ 9న 2లక్షల రుణమాఫీ అని చెప్పిన రేవంత్ ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రైతన్నల ఉసురు పంచుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న BC రిజర్వేషన్ 23% నుండి 42% కి పెంచుతామన్న హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుందని, ఇప్పటి వరకు నియోజకవర్గాలకి ఇచ్చింది గాడిద గుడ్డని అన్నారు. తెలంగాణలోని ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలం అసెంబ్లీలో ప్రజా సమస్యల పై, ఎన్నికల హామీల పై కచ్చితంగా నిలదీస్తామని ఎమ్మెల్యే అన్నారు. గ్యారంటీలు, డిక్లరేషన్లు హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్ట బోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్ముర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా నాయకులు మండల అధ్యక్షులు కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Similar News