నిర్లక్ష్యం నీడన ప్రభుత్వ పాఠశాలలు.. సమయపాలన పాటించని ఉపాధ్యాయులు..

పిట్లం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం నీడన కొనసాగుతున్నాయి.

Update: 2024-09-11 14:50 GMT

దిశ, పిట్లం : పిట్లం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం నీడన కొనసాగుతున్నాయి. స్థానికంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు ఇతర ప్రదేశాల నుంచి రావడంతో సమయానికి ప్రార్థన కూడా చేయని పరిస్థితులు నెలకొంటున్నాయి. బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాబోధనకు 17 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ప్రార్థన సమయంలో 7 నుంచి 10 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉండడం గమనార్హం. వీటిని అన్నింటినీ నియంత్రించాల్సిన మండల స్థాయి అధికారికి ఇన్చారి బాధ్యతలు అధికమవడంతో కనీసం ఎప్పుడు ఏ మండలంలో విధులు నిర్వహిస్తున్నాడో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

పిట్లం బాలుర ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా కొనసాగుతున్న దేవి సింగ్ మండల విద్యాధికారిగా కొనసాగుతున్నాడు. ఇతను పిట్లం మండలంతో పాటు నిజాంసాగర్, పెద్ద కొడపగల్ మండలాలు సైతం ఇంచార్జ్ ఉన్నారు. ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేయాల్సిన మండలాధికారి ఎప్పుడు ఏ మండలంలో ఉంటున్నాడో తెలియకుండా పోవడంతో ఉపాధ్యాయులు ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మండలంలో అనేకంగా వినిపిస్తున్నాయి. సమయం దొరికితే చాలు ఏదో ఒక కారణం చెప్పి ఉపాధ్యాయులు తమ విధులకు డుమ్మాలు కొడుతున్నట్లు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సమస్యలలో ఉర్దూ పాఠశాల..

పిట్లం మండలంలో కొనసాగుతున్న ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇందులో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించే విద్యార్థులు ఉన్నప్పటికీ వారికి విద్యను బోధించడానికి ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో స్కావెంజర్స్ సైతం లేకపోవడంతో పాఠశాలను శుభ్రం చేసుకునే పరిస్థితి విద్యార్థులకు ఏర్పడుతున్నది. పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉర్దూ పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్ భాషల పై విద్యార్థులు పట్టు సాధించలేకపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి పాఠశాలల్లో ఏర్పడిన సమస్యలను నివారించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Similar News