టపాకాయ నిప్పు రాజేసిన పంచాయితీ

అయోధ్యలోని శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో కాల్చిన ఓ టపాకాయ మత ఘర్షణకు కారణమైంది.

Update: 2024-01-23 10:42 GMT

దిశ, బాన్సువాడ : అయోధ్యలోని శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్బంగా రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో కాల్చిన ఓ టపాకాయ మత ఘర్షణకు కారణమైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం భజరంగ్ దళ్ నాయకులు, హిందూ యువకులు అయోధ్య బాల రాముని శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో టపాకాయలు కాలుస్తుండగా నిప్పురవ్వ ఎగిరివచ్చి మజీద్ లోపల పడింది. దాంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ విషయంపై గ్రామ సర్పంచ్ ఖాదర్ తెల్లారినాక మాట్లాడుకుందామని చెప్పగా భజరంగ్ దళ్ కార్యకర్తలు షిండే రామేశ్వర్, హరీష్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు

     మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే ఇరు వర్గాల వారు దాదాపు 20 నుండి 30 మంది అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారు మాట్లాడుతున్న సమయంలో ఇస్మాయిల్, హుస్సేన్ మరో ఇద్దరు వ్యక్తులు తమపై దాడి చేసి బూతులు తిట్టారని కొందరు పేర్కొన్నారు. ఇందులో సర్పంచ్​ ప్రమేయం ఉందని బాధితులు తెలిపారు. అనంతరం తమకు న్యాయం చేయాలని భజరంగ్​దళ్​ నాయకులు, విశ్వహిందూ పరిషత్ నాయకులు, హిందూ యువకులు కోటగిరి - రుద్రూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి జైశ్రీరామ్ నినాదాలతో రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ కిరణ్ కుమార్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసరాజు, రుద్రూర్

     ఎస్సై మహేందర్, కోటగిరి ఎస్సై సందీప్, వర్ని ఎస్ఐ, రుద్రూర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భజరంగ్ దళ్ నాయకులను సముదాయించే ప్రయత్నం చేయగా వారు తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేంత వరకు రాస్తారోకో విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నిరసనలో విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రసారక్ పార్వతి మురళి, ప్రశాంత్ గౌడ్, భజరంగ్ దళ్ నాయకులు ధర్మారం వెంకటేష్, అనిల్, శివ, వడ్ల సాయినాథ్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


Similar News