Ex MLA Jeevan Reddy : అష్టదిగ్బంధనంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్ ఎమ్మెల్యే గా రెండుసార్లు పనిచేసిన జీవన్ రెడ్డికి మాజీగా మారగానే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సోమవారం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఆర్మూర్ ఎమ్మెల్యే గా రెండుసార్లు పనిచేసిన జీవన్ రెడ్డికి మాజీగా మారగానే షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సోమవారం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.20 కోట్ల రుణం తీసుకుని నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ మల్టీప్లెక్స్ సంబంధించిన రుణం చెల్లింపులో నిర్లక్ష్యంపై నోటీసులు జారీ చేసింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున రుణానికి గ్యారెంటీగా ఉన్న మరో నలుగురికి సైతం ఎస్ఎస్సి నోటీసులు జారీ చేయడం గమనార్హం.
సోమవారం ఆర్మూర్ ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంకాపూర్ లో ఉన్న కంకర క్వారీని మైనింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇదిలా ఉండగా ఈ నెలలోనే ఆర్టీసీ తమకు రావాల్సిన లీజు బకాయిల కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బకాయిలు కట్టాలని లేకపోతే సీజ్ చేస్తామని ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. విద్యుత్ శాఖ అధికారులు కూడా జీవన్ రెడ్డి మాల్ నుంచి తమకు రావాల్సిన రెండున్నర కోట్ల విద్యుత్ బకాయిల కోసం ఏకంగా కరెంటు సరఫరా నిలుపుదల చేసి షాక్ ఇచ్చారు.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిని వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టైనా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కొట్టాలన్న జీవన్ రెడ్డి ఆశలు అడియాశలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సీఎం కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తిని మూడోసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని చెప్పుకుని ప్రచారం చేసిన నిజామాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు విశ్వసించలేదు. దీంతో రెండు సార్లు సునాయాసంగా గెలిచిన జీవన్ రెడ్డి మూడోసారి మాత్రం మూడో స్థానానికి పడిపోయారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో జీవన్ రెడ్డి టార్గెట్ గా పావులు కదులుతున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది అందరికీ తెలిసిన విషయమే. ఆర్మూర్ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్, బీజెపికి ప్రథమ శత్రువు జీవన్ రెడ్డి. దీంతో అక్కడ జీవన్ రెడ్డి టార్గెట్ గా పావులు కదులుతున్నాయి. తమను రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు జీవన్ రెడ్డి చేసిన ప్రయత్నాలను ఆయనపైనే ప్రయోగించే పనులు జరుగుతున్నాయి. అందుకు ప్రధానంగా అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు చేయడం వాటిపై విచారణకు అధికార యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రక్రియ జోరు అందుకుంది. మాక్లూర్, ఆర్మూర్ మండలంలో మొరం మాఫియా పై పోలీస్ శాఖ ఇదివరకే ఉక్కుపాదం మోపింది.
తాజాగా జీవన్ రెడ్డి భూ బాధితులను తెరపైకి తెచ్చే కార్యక్రమం చురుకుగా సాగుతున్నట్టు సమాచారం. జీవన్ రెడ్డి లేదా అతని అనుచరుల పేరు మీద ఉన్న భూముల కబ్జాలు అసైన్డ్ భూములను చెరబట్టడం లాంటి వాటిని తెరపైకి తెచ్చి కట్టడి చేసే పని జోరందుకుంది అని విశ్వసనీయ సమాచారం. తాజాగా జీవన్ రెడ్డి పై ట్రోలింగ్ జోరుగా జరుగుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జీవన్ రెడ్డి పై ఎక్కడలేని పోస్టింగులు దర్శనమిస్తున్నాయి. ఓడిన మీ వెంటే ఉంటానని జీవన్ రెడ్డి అన్న వ్యాఖ్యలను జోడిస్తూ జీవన్ రెడ్డి ఎక్కడా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్టింగ్లు ప్రచారం జోరందుకుంది.