దిశ ప్రతినిధి, నిజామాబాద్ః శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 41వ గేటు కూడా తెరుచుకుంది. సోమవారం మధ్యాహ్నం 12.25 గంటలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 40గేట్లు పైకి ఎత్తి నీటిని అధికారులు కిందికి వదిలారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మరో గేటును పైకెత్తారు. ప్రస్తుతం 41 గేట్ల ద్వారా ప్రాజెక్టు నుండి నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు 2,15,853 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు ఉన్నతాధికారుల సూచన మేరకు అవుట్ ఫ్లో ను 2,50,000 క్యూసెక్కులకు పెంచేశారు. తిరిగి మరోసారి ఉన్నతాధికారుల సూచన మేరకు రాత్రి 8 గంటల ప్రాంతంలో 41వ గేటును కూడా పైకెత్తారు. దీంతో అవుట్ ఫ్లో కూడా 3,32,840 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు ఎగువ భాగం నుండి 2,23,029 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి కలుస్తోంది. ప్రస్తుతం మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నమోదైన ఇన్ ఫ్లో 2,30,840 క్యూసెక్కులు కాగా, ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 1088.30 అడుగులు, 70.710 టీఎంసీలు ఉంది. గత యేడాది ఇదే రోజున ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 1090.60 అడుగులు, 78.868 టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన గత ఏడాది కన్నా ఈసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 8 టీఎంసీల కన్నా తగ్గినట్లు తెలుస్తోంది. ఈ యేడాది జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి వచ్చిన ఇన్ ఫ్లో ద్వారా వచ్చి చేరిన నీరు 93.603 టిఎంసీలు కాగా, అవుట్ ఫ్లో 30.413 టీఎంసీ ల నీటిని దిగువకు వదిలినట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టులో పెరిగిన నీటిమట్టం
భారీ వర్షాలతో చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నిండుతున్నాయి. జలసిరితో కళకళలాడుతున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో కూడా ఎగువ నుంచి వస్తున్న వరద తాకిడితో నీటిమట్టం భారిగా పెరిగింది. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో 50,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో తో ప్రాజెక్టులు వాటర్ లెవెల్ 1400.40 అడుగులు, 11.786 టీఎంసీ లకు చేరుకుంది.
ఈనెల 1న సాయంత్రం ఐదు గంటలకు ప్రాంతంలో ఇన్ ఫ్లో 24,600 క్యూసెక్కులతో ప్రాజెక్టు నీటిమట్టం 5.293 టీఎంసీలుగా ఉండగా, రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇన్ ఫ్లో కూడా 50,600 క్యూసెక్కులకు పెరిగింది. దీంతోపాటు రెండు రోజుల్లో ప్రాజెక్టులో నీటిమట్టం 6 టీఎంసీలు పెరిగి 11.786 టీఎంసీలకు చేరుకుంది.