గ్రామ పంచాయతీలను పట్టించుకోని ప్రత్యేకాధికారులు..

పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయింది.

Update: 2024-07-11 10:22 GMT

దిశ, తాడ్వాయి : పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయింది. పారిశుధ్యం పై పర్యవేక్షణ కొరవడడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. తాడ్వాయి మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రత్యేక అధికారులు నామమాత్రంగానే పల్లెల ముఖం చూడడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడింది. దీని ఫలితంగా స్థానికంగా పంచాయతీ కార్యదర్శులపైనే మొత్తం భారం పడుతున్నది. ప్రత్యేకాధికారుల పాలనకు ముందు పంచాయతీ ఖాతాల్లోని నిధులను సర్పంచులు వాడేసుకున్నారు.

దింతో ఇప్పుడు పంచాయతీల ఖాతాల్లో ఒక్క పైసా కూడా లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి కొన్ని నెలలుగా నిధులు జమకావడం లేదు. దీంతో పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోంది. గ్రామాల్లో పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. గతంలో చేపట్టిన పలు పనులకే నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉండడటంతో కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపడకపోతే ప్రజలు జబ్బుల బారినపడే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామాల్లో చిన్న పెద్దా అనే తేడా లేకుండా అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుధ్య చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

గ్రామ పంచాయతీల్లో నిధులకు కటకట..

గ్రామ పంచాయతీలు నిధుల కటకటను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఖాతాల్లో డబ్బులు లేక, అత్యవసర పనులకు ఖర్చు చేయలేక సతమతమవుతున్నారు. పారిశుధ్య కార్మికులకు జీతాలు, పైపుల లీకేజీ మరమ్మతు, బోర్ల మరమ్మతు పనులు, పంచాయతీ ట్రాక్టర్‌ నెలవారీ బ్యాంకు వాయిదా, గ్రామాల్లో విద్యుత్‌ దీపాలు, నెలనెలా విద్యుత్‌ బకాయిలు.. ఇవన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే. నిధులు లేకపోవడంతో ఈ బరువు బాధ్యతల గురించి ప్రత్యేకాధికారులు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.

గ్రామ కార్యదర్శులే అప్పులు చేసి ఎలాగోలా కార్మికులకు జీతాలు సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామపంచాయతీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అప్పు చేసి చెల్లిస్తున్నారు. పంచాయతీల ప్రత్యేకాధికారులు ఖర్చు విషయంలో ముఖం చాటేయడంతో భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. నాలుగు రోజులు ఉండిపోయే వాళ్లమని ప్రత్యేకాధిరులు దాటవేత ధోరణిని అనుసరిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.


Similar News