గుట్టు చప్పుడు కాకుండా తప్పుడు వ్యవహారం?
నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్మాఫియానే రేషన్ బియ్యం దందాను శాశిస్తుంది అంటే...Special News Of seized Ration Rice
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పీడీఎస్మాఫియానే రేషన్ బియ్యం దందాను శాశిస్తుంది అంటే అవుననే చెప్పాలి. జిల్లాలో చాలా ప్రాంతాల్లో రీసైక్లింగ్ దందాపైనే కొన్ని రైస్ మిల్లులు నడుస్తున్నాయి. సీయంఆర్ కోసం కేటాయించిన ధాన్యాన్ని టన్నుల కొద్ధీ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న రైస్ మిల్లర్లు వాటిని భర్తీ కోసం రేషన్ బియ్యంను నమ్మకున్నాయి. జిల్లాలో సీయంఆర్ పట్టించిన బియ్యంను సైతం దొంగిలిస్తున్న ముఠాలు ఉండగా, మరి కొన్ని ముఠాలు ఇంటింటా ప్రజల వద్ధ తక్కువ ధరకు పీడీఎస్ బియ్యాన్ని సేకరించి ఎక్కువ ధరకు మిల్లర్లకు అప్పగిస్తున్నారు. వారికి రేషన్ డీలర్ల ఇతోధిక సాయం చేస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. అది చాలదన్నట్లు పీడీఎస్ రీసైక్లింగ్ కు దాడులలో దొరికిన బియ్యాన్ని తిరిగి వారికి అప్పగించేందుకు సంబంధిత శాఖలో కొందరు స్వాహ పర్వానికి తెరదీసినట్లు తెలిసింది. తాజాగా పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడుల్లో పట్టుబడ్డ బియ్యం స్వాహా చేశారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు కోడై కూస్తోంది. 'స్వాధీన బియ్యం మాయం చేసి, బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకున్నారనే ఆరోపణలకు బలం చేకూరింది. భౌతికంగా లేని బియ్యానికి ఉత్తుతి టెండర్లు వేసి, అక్రమాన్ని సక్రమం చేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. కమీషన్ కాసుల కక్కుర్తిలో ఈ స్కాం బయటకు రాలేదు. దాడుల్లో స్వాధీనమైన రేషన్ బియ్యం మాయం విషయం బయటకు పొక్కలేదు. గుట్టు చప్పుడు కాకుండా తప్పుడు వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నాలు ఫలించాయి అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అడ్డదారిలో నల్లబజారుకు..
నిజామాబాద్ జిల్లాలో సుమారు 780 రేషన్ పంపిణీ దుకాణాలు ఉండగా నిజామాబాద్ అర్బన్ పరిధిలో 90 దుకాణాలు ఉన్నాయి. నగరంలో దాదాపు లక్షపై చిలుకు రేషన్ కార్డుదారులు ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులో పేరున్న ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల బియ్యం అందిస్తారు. కరోనా సమయం నుంచి కేంద్రం ఐదు కిలోలు, రాష్ట్రం ఐదు కిలోల బియ్యం అదనంగా అందించాయి. సాధారణంగా నెలకు నగరంలో 35 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. పంపిణీకి గోదాముల నుంచి దుకాణాలకు వచ్చిన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే లబ్దిదారుల పేరుతో అక్రమాలకు పాల్పడతున్నారు. దొడ్డిదారిన బియ్యం మిగుల్చుకుని అడ్డదారిలో రేషన్ బియ్యం నల్ల బజారుకు తరలుతున్న విషయం తెలిసిందే. డీలర్లు, వ్యాపారులు కలిసి బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ఈ అక్రమ వ్యవహారాల సమయంలో బియ్యం పట్టుబడుతోంది. నిక్కచ్చి అధికారులు ఆకస్మిక దాడులు, ప్రజా ప్రతినిధుల కన్నెర్ర, విశ్వసనీయ వర్గాల సమాచారం, సామాజిక సేవకుల ప్రశ్నించేతత్వం సమయంలో ఈ మెరుపు దాడులు చోటు చేసుకుంటున్నాయి.
గత ఎడాది నవంబర్ లో వర్ని శివారు, నిజామాబాద్ అర్బన్ పరిధిలోని మాలపల్లి, బాబన్ సబ్ పాడ్, మోపాల్, కంజర్ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో పట్టుబడి, సీజ్ చేసిన బియ్యమే సాక్ష్యం. ఇలా సీజ్ చేసిన బియ్యాన్ని ఎం ఎల్ ఎస్ కేంద్రాలు లేదంటే స్థానిక రేషన్ దుకాణాల్లో నిల్వ చేస్తారు. రికార్డుల్లో నమోదు చేస్తారు. కోర్టు తీర్పు, కేసు పరిష్కారం అనంతరం ఈ బియ్యాన్ని బహిరంగ వేలంలో అమ్మేసి వచ్చిన సొమ్మును ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయాలి. ఇదంతా జరగడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఆక్రమార్కులు దీన్ని అసరాగా చేసుకుంటున్నారు. అధికారులు సీజ్ చేసిన బియ్యాన్ని నిల్వల్లో చూపించి, బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. అడిగేవారే లేకపోవడంతో ఈ అక్రమ దందా సాగుతోంది.
సీజ్ చేసిన బియ్యం లెక్కలు తీయాలి
తాజాగా జిల్లా సివిల్ సప్లై అధికారులు చర్చల్లో పట్టుబడ్డ బియ్యం ప్రస్తావన వచ్చింది. సీజ్ చేసిన బియ్యం లెక్కలు తీయాలని అధికారులను ఆదేశించారు. రికార్డుల ప్రకారం ఉన్నతాధికారులు ముందు ఉంచారు. పట్టుబడ్డ బియ్యానికి టెండర్ వేయాలని ఉన్నతాధికారులు అదేశించారు. రేషన్ డీలర్లలో వణుకు మొదలైంది. సీజ్ చేసిన బియ్యాన్ని ఎప్పుడో అమ్మేసుకున్నారు కాబట్టి, ఇప్పుడు అధికారులకు పరిస్థితిలో రేషన్ అప్పగించలేని అధికారులను గప్ చుప్ గా కలిశారు. ఏమైనా చేసి తమను రక్షించాలని వేడుకున్నారు. లోపాయి కారిగా ముడుపుల ఒప్పందం చేసుకున్నారని సివిల్ సప్లై శాఖలో గుప్పుమంది. అందులో భాగంగా లేని బియ్యాన్ని ఉన్నట్టు రికార్డుల్లో చూపించి, ఫైలింగ్ కోసం టెండర్లు వేసి, వాళ్ల మనుషులే అరకొర రేటుకు టెండర్లు దక్కించుకునేలా చేసి, అక్రమాన్ని సక్రమం చేసారని వినికిడి. ప్రస్తుతం ఈ భాగోతం బయటకు పొక్కడంతో కక్కలేని మింగలేని పరిస్థితుల్లో అక్రమార్కుల వ్యవహారం బయటకు పొక్కింది.
Also Read:
GWMC : బల్దియాలో గోల్‌మాల్..! దోచుకున్నోళ్లకు దోచుకున్నంత..