ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ఆకాంక్ష..
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, బాలింతలు గర్భిణీలు రక్తహీనతతో బాధపడొద్దన్న ఉద్దేశంతోనే న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తుందని సీఎం ఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు.
దిశ, భిక్కనూరు : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తుందని, బాలింతలు గర్భిణీలు రక్తహీనతతో బాధపడొద్దన్న ఉద్దేశంతోనే న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తుందని సీఎం ఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలోని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిట్లకు సంబంధించిన వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి మండల కేంద్రంలోని కొత్తపేటలో ఉన్న రెండు అంగన్వాడి కేంద్రాలను సందర్శించి బాలింతలను, గర్భిణీలను న్యూట్రిషన్ కిట్ పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యూట్రిషన్ కిట్ల తయారీలో ఎక్కడా రాజీ పడకుండా, నాణ్యతతో కూడిన పోషక పదార్థాలను ఈ కిట్టు ద్వారా ప్రభుత్వం అందిస్తుందన్నారు. న్యూట్రిషన్ కిట్ ను ఎవరైనా చూశారా...? అంటూ వాకబ్ చేయడంతో పాటు, ఈ కిట్ లో ఉన్న మదర్ హార్లిక్స్ ఎన్నో ప్రోటీన్లతో కూడుకున్నదని తద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఆరోగ్యం లభిస్తుందన్నారు.
పుట్టబోయే బిడ్డతో పాటు, గర్భంలో ఉన్న బిడ్డ తల్లి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు వీలుగా ఈ కిట్ ను తయారు చేశామన్నారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరిగి చిన్నారులు చదువుకొని ఉన్నత ఉద్యోగాల్లో కొలువులు పొందే విధంగా దోహదపడుతుందన్నారు. కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో గర్భిణీల ఆరోగ్యంపై అధ్యయనం చేసిన కేసీఆర్, అక్కడ అమలవుతున్న పథకం గురించి వివరించగా మనరాష్ట్రంలో కూడా అమలు చేద్దామని చెప్పి న్యూట్రిషన్ కిట్ ను ఇక్కడ మనరాష్ట్రంలో కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. మామూలుగా వాడే సిరఫ్ ల కంటే, ఈ న్యూట్రిషన్ కిట్ లో ఉన్న పోషక పదార్థాలు ఎంతో బలాన్ని స్తాయన్నారు. గర్భిణీలు బాలింతల కోసమే ప్రభుత్వం కొత్తగా ఈ న్యూట్రిషన్ కిట్ లాంచ్ చేసిందన్నారు. న్యూట్రిషన్ కిట్ లో ఇచ్చిన పోషకాహారం మందులను వినియోగించాలని, బలహీనతలు లేకుండా పుట్టిన ప్రతిపిల్ల ఆరు సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉంచితే వారు జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆకాంక్షించారు.
సాధారణ ప్రసవాలతోనే ఆరోగ్యం.. శిశు సంక్షేమ శాఖ అదనపు కమిషనర్ భారతి హోలీ కేరి..
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు చేసుకుంటే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. 18 సంవత్సరాలు వచ్చేవరకు వివాహం చేయకూడదని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నమహిళలు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ప్రసవం అయిన గంటలోగా బాలింతలు పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలన్నారు. ముర్రుపాలు తాగడంవలన చిన్నారులకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. గర్భిణీలకు హిమోగ్లోబిన్ 14 శాతం ఉండేవిధంగా చూసుకోవాలన్నారు.
కంటి వెలుగు శిబిరం సందర్శన
మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న కంటివెలుగు శిబిరాన్ని సందర్శించి, ఇప్పటివరకు కంటి అద్దాలు అందజేశారని ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, సర్పంచ్ తునికి వేణు, జెడ్పీటీసీ సభ్యురాలు తాటిపాముల పద్మ నాగభూషణం గౌడ్, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ పెద్ద బచ్చగారి నర్సింహారెడ్డి, జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ లు చంద్రశేఖర్, శోభారాణి, ప్రాథమిక వైద్యాధికారిణి యేమామి, వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.