ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యాన్ని మరోసారి చూపిస్తా..
గత ఎన్నికల్లో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
దిశ, ప్రతినిధి, నిజామాబాద్: గత ఎన్నికల్లో దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి రాజన్న రాజ్యాన్ని మరోసారి చూపిస్తానని ప్రజలకు పిలుపు నిచ్చారు. సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామం నుండి మొదలైన ప్రజాప్రస్థానం పాదయాత్ర హాజీపూర్ గ్రామం వరకు అక్కడి నుంచి ఎల్లారెడ్డికి చేరింది.
ఈ సంధర్బంగా ప్రజా ప్రస్థానంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ 19 ఏళ్ల క్రితం వైఎస్సార్ చేసిన ప్రజా ప్రస్థానం ఒక చరిత్ర అని, వైఎస్సార్ వేసిన ప్రతి అడుగు ప్రజా సంక్షేమానికి పరుగులు తీసిందనీ గుర్తు చేశారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ షర్మిల ప్రత్యక్షం అవుతుందని, షర్మిల ఏ పోరాటం చేసినా మీకోసమే మీ జీవితాలు కోసమే అని షర్మిలమ్మ అన్నారు. వైఎస్సార్ పాలన మీరు కోరుకుంటే ఆయన బిడ్డను ఆశీర్వదించండనీ కోరారు. సంక్షేమం, స్వయం సమృద్ది, సమన్యాయం కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని తెలిపారు.
2500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న అంటే మీ అభిమానమే, నడిచింది నేనే అయినా నడిపించింది మీ అభిమానమే ఆమె అన్నారు. ఇదే ఎల్లారెడ్డి నియోజక వర్గంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలుగు రోజులు పాదయాత్ర చేశారని, ఆరోజుల్లో సాగునీరు అందడం లేదని రైతులు వైఎస్సార్ దృష్టికి తీసుకు వచ్చారని గుర్తు చేశారు. పోచారం ప్రాజెక్ట్ కాలువలు మరమత్తులు చేస్తే నీళ్ళు వస్తాయని అన్నారు. ఆ రోజు వైఎస్సార్ మాట ఇచ్చారు ఆయన అధికారంలో వచ్చాక కాలువల మరమత్తులు చేయించారని ఇది వైయస్సార్ గొప్పతనం అన్నారు.
ఆయన 20 వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారని, 2008 లో బై ఎలక్షన్ లో ఎల్లారెడ్డికి డిగ్రీ కాలేజీ ఇస్తామని మాట ఇచ్చి 20 రోజుల్లో ఇచ్చారన్నారు. మోడల్ రెసిడెన్షియల్ కాలేజీగా తీర్చి దిద్దారని, గాంధారి, పోతంగల్ బ్రిడ్జీలను కట్టారని తెలిపారు. ఎన్నికల్లో కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చాడని, ఈ నియోజక వర్గానికి 10 టీఎంసీల నీళ్ళు ఇస్తా అన్నారు ఇచ్చారా అని ప్రశ్నించారు. చెరువుల మీద చెక్ డ్యాంలు అన్నారు కట్టారా? మంజీర నీళ్ళు అన్నారు ఇచ్చారా ?ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు.
ఇచ్చారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పట్లో 38వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఇప్పుడు మాత్రం ఒక లక్ష ఇరవై వేల కోట్లకు చేరుకుంది. అంటే ఇందులో 70 వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలుస్తుంది. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని పోచారం డ్యాం ఎత్తు పెంచుత అన్నారు. పెంచారా..? ఇక కేటీఆర్ ఇక్కడ ఇండోర్ స్టేడియం కడతాం అన్నారు. కట్టారా..? ఉర్దూ పాల్టెక్నిక్ కాలేజీ అన్నారు. ఇచ్చారా..? అని ఆమె ప్రశ్నించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏ పార్టీ అని, ఆయన తెరాస కాదు కదా కాంగ్రెస్ కదా ఈయన ఒక జంప్ జిలానీ అని ఎద్దేవా చేశారు.
ఈ నియోజక వర్గంలో అడుగు పెట్టగానే స్థానిక మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ 32 ఎకరాలు అసైన్డ్ భూమి కాజేశారు అని చెప్పారని అన్నారు. అలాంటి వాడి అరాచకాలు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ను గెలిపించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ తెరాస పార్టీకే అమ్ముడు పోయారని ఇది రాజకీయం వ్యభిచారం కాదా అని ప్రశ్నించారు. ఈ నియోజక వర్గ ప్రజల అత్మ గౌరవం కేసీఆర్ చెప్పు కింద తాకట్టు పెట్టారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వైఎస్సార్ టీపీకి ఒక అవకాశం కల్పిస్తే, రాజన్న పాలన చూపిస్తామని ఆమె ప్రజలను కోరారు.
హజీపూర్ లో వైఎస్సార్ విగ్రహవిష్కరణను అడ్డుకున్న పోలిస్ లు..
ఎల్లారెడ్డి మండల పరిధిలోనీ లక్ష్మాపూర్ గ్రామం నుండి మొదలైన ప్రజాప్రస్థానం పాదయాత్ర హాజీపూర్ గ్రామం వరకు వచ్చి అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఐదు గ్రామాల ప్రజలు ముందుకు వచ్చారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని పోలీసులు అన్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుకు అడ్డుకున్నారు. విగ్రహం ఏర్పాటు చేయాలంటే ముందు అనుమతి తీసుకోవాలని పోలీసులు అన్నారు. రాజకీయ వత్తిళ్లతోనే విగ్రహం ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారని ఇప్పటికైనా విహాజిపూర్ గ్రామంలో వైఎస్సార్ విగ్రహం పెట్టి తీరుతామని వైఎస్ఆర్ బిడ్డగా మాట ఇస్తున్నాను అని వైఎస్ షర్మిలా అన్నారు.
నేను ఇక్కడికి వచ్చి విగ్రహం పెట్టిస్తా, టీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాజ్య సమితి, ఇక్కడ బందిపోట్ల రాజ్యమే నడుస్తుందని అన్నారు. జరిగిన ప్రజాప్రస్థాన పాద యాత్రలో ఆమె మాట్లాడారు. హాజీపూర్ గ్రామం నుండి రెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ప్రజాప్రస్థానం యాత్ర చేరుకుంది. బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ముందుగా వైయస్సార్ సతీమణి, కడప ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటితో 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని, దీనికి అంతటికి మీ ప్రేమ అభిమానాలే కారణమన్నారు.
షర్మిలమ్మ వైఎస్సార్ ముద్దుల బిడ్డ, అని షర్మిలను అపురూపంగా వైఎస్సార్ పెంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మీకోసం షర్మిల పాదయాత్ర చేస్తు కష్టపడుతుంటే చాలా గర్వంగా అనిపిస్తుందన్నారు. కొంత జీవితాలకు అర్థం పరమార్థం ఉంటుందని, కొన్ని జన్మలకు సార్థకత ఉంటుందని, తన జన్మకు ఒక సార్థకత ఉండాలని మీకు సేవ చేయాలని షర్మిల కంకణం కట్టుకుని గడప గడపకు వస్తుందని అన్నారు. 19 ఏళ్ల క్రితం వైఎస్సార్ చేసిన ప్రజా ప్రస్థానం ఒక చరిత్ర అని, వైఎస్సార్ వేసిన ప్రతి అడుగు ప్రజా సంక్షేమానికి పరుగులు తీసిందనీ గుర్తు చేశారు.
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ షర్మిల ప్రత్యక్షం అవుతుందని, షర్మిల ఏ పోరాటం చేసినా మీకోసమే మీ జీవితాలు కోసమే అని విజయమ్మ అన్నారు. వైఎస్సార్ పాలన మీరు కోరుకుంటే ఆయన బిడ్డను ఆశీర్వదించండనీ కోరారు. సంక్షేమం, స్వయం సమృద్ది, సమన్యాయం కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీపీ నేతలు ఏపూరి సోమన్న, బాలరాజు నీలం రమేష్ పెద్ద ఎత్తున మహిళలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.