రోడ్డు పక్కనే చెత్త... ఇలా చేస్తే ఎట్లా...
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు.. అలాంటి గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు సక్రమంగా అమలు చేయడంలో ప్రత్యేక అధికారులు విఫలమవుతున్నారు.
దిశ, కమ్మర్ పల్లి : గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు.. అలాంటి గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు సక్రమంగా అమలు చేయడంలో ప్రత్యేక అధికారులు విఫలమవుతున్నారు. నిత్యం గ్రామాల్లో పరిశుభ్రం చేయాల్సిన పారిశుధ్య సిబ్బంది, పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో పల్లెలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, సేకరించిన చెత్తతో ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంగా సెగ్రిగేషన్స్ షెడ్లను నిర్మించింది. కానీ ప్రస్తుతం తొలగించిన చెత్తను కుప్పలు కుప్పలుగా పోయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలతో పాటు దుర్వాసన రావడంతో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది.
నిజామాబాద్ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం ధోరణి కనిపిస్తుంది. చెత్త సేకరణతోనే సరి పెట్టగా వాటిని వేరు చేసే పద్ధతి లేదు, గత ప్రభుత్వ సెగ్రిగేషన్ షెడ్లను రూ. లక్షలు వెచ్చించి నిర్మించారు. గ్రామాల్లో సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లకు చేర్చి తడి, పొడి చెత్తను వేరు చేయాల్సి ఉంది. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసి స్వయం సమృద్ధి సాధించాలి. కానీ ఇప్పుడు అదేది కూడా అమలు కావడం లేదు. ట్రాక్టర్లల ద్వారా తీసుకొచ్చిన చెత్తను కుప్పలు కుప్పలుగా పోసి తగలబెడుతున్నారు. మరికొన్ని చోట అలాగే వదిలేస్తున్నారు. రహదారి కొండ పోయే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు.
ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు పక్కదారి పట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామపంచాయతీలో కనీసం అవసరాలను తీర్చలేక పోతున్నారని ఆయా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులు,ఎంపీటీసీలు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు,అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో సిబ్బంది, కార్యదర్శులు, అధికారులు తూతూ మంత్రంగానే పర్యవేక్షణ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో కమ్మర్ పల్లి మండలంలో ఉప్లూర్, నాగాపూర్, ఆర్.ఆర్ నగర్, కమ్మర్ పల్లి, కోనాపూర్ గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా అధికారులు గ్రామపంచాయతీల పై దృష్టి పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.