గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాపై కార్యదర్శుల ఆరా
గృహలక్ష్మి పథకం కింద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరైన గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఎక్కడి వరకు వచ్చిందన్న విషయమై అధికారులు గ్రామాల్లో ఎంక్వయిరీ మొదలుపెట్టారు.

దిశ, భిక్కనూరు: గృహలక్ష్మి పథకం కింద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు మంజూరైన గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్టేటస్ రిపోర్ట్ ఎక్కడి వరకు వచ్చిందన్న విషయమై అధికారులు గ్రామాల్లో ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల లిస్టును జిల్లాలోని అన్ని మండల పరిషత్ అధికారులకు పంపింది. ఈ మేరకు వారు గ్రామాల వారీగా ఉన్న పంచాయతీ కార్యదర్శులకు లిస్టును పంపిన అధికార యంత్రాంగం నివేదిక తయారు చేసి పంపాలని ఆదేశించింది. ఈ మేరకు కార్యదర్శులు గ్రామాల్లో తిరుగుతూ, తమ వద్ద ఉన్న లబ్ధిదారుల లిస్ట్ ప్రకారం గ్రామాల్లో వివరాలు సేకరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి రోజుల్లో ఎమ్మెల్యేలు గృహలక్ష్మి పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి రూ.3లక్షలు చెల్లించాలని నిర్ణయించింది.
భిక్కనూరు మండలంలోని ఓ గ్రామంలో ఒకరికి ఫోన్ చేసి, మీ అమ్మ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది కదా, ఆ ఇంటి నిర్మాణం పనుల పురోగతి ఎక్కడి వరకు వచ్చిందో చెప్పాలని ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కుమారుడు షాక్ కు గురయ్యాడు. మాకు ఆ పథకం గురించే తెలియదని, మేము దరఖాస్తు కూడా చేసుకోలేదని ఆయన తెల్ల మొహం వేశారు. నాకు తెలియకుండా తన తల్లి పేరున కుమారుడైన ఇల్లు మంజూరవ్వడం ఏమిటంటూ ఆశ్చర్య వ్యక్తం చేశారు. పైగా కొత్త ఇంటి నిర్మాణం చేపట్టావు కదా? ఆ ఇంటి ముందు ఫొటో దిగితే చాలంటూ, సదరు కార్యదర్శి ఫోన్ లో చెప్పడం గమనార్హం. తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో పాటు, బ్యాంకులో తీసుకున్న లోన్ డబ్బులు కలిపి ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. నేను కట్టుకున్న ఇంటి ముందు మా అమ్మ ఫోటో ఎలా దిగుతుందంటూ సమాధానం ఇచ్చాడు.
కామారెడ్డి నియోజకవర్గంలో 3 వేల ఇళ్లు.. 502 ఇళ్లకు అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్..
కామారెడ్డి నియోజకవర్గంలో 3 వేల ఇళ్లు గృహలక్ష్మి పథకంలో భాగంగా అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. సొంత ఇంటి స్థలం ఉన్న అర్హులైన పేదలకు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షలు వంద శాతం సబ్సిడీతో మంజూరు ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి మంజూరైన రూ. 3 లక్షల నిధులు మూడు విడతల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రొసీడింగ్స్ లో పేర్కొంది. బేస్మెంట్ లెవెల్ లో మొదటి విడత, రూఫ్ లెవెల్ లో రెండో విడత, ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశలో మూడో విడత నిధులు విడుదల చేయాలి. దీనికి సంబంధించిన విషయాలను పొందుపరుస్తూ గ్రామాల వారీగా లబ్దిదారుల జాబితాతో ప్రొసీడింగ్స్ కూడా సెప్టెంబర్ 27, 2023 లో జారీ చేశారు. మండలంలోని 18 గ్రామాలకు 502 ఇళ్లు మంజూరు చేసి 2023 లో సెప్టెంబర్ నెలలో అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ కూడా ఇచ్చారు. అయితే తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రచారంలో బీఆర్ఎస్ హయాంలో మంజూరైన గృహలక్ష్మి ఇళ్ల విషయం మరుగున పడిపోయింది. తాజాగా అధికారులు గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణం పనుల స్టేటస్ పై ఎంక్వయిరీ మొదలు పెట్టడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
అనూహ్యంగా గృహలక్ష్మి ఇళ్లు వెలుగులోకి..
రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించే చర్చ జరుగుతుండగా, గృహలక్ష్మి పథకం వెలుగులోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు నిర్మించుకున్న వారికి, అప్పటి ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేయలేదు. పైగా ఈ పథకం గురించి ఎవరికి తెలియదు కూడా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎంక్వయిరీ మొదలుపెట్టిన అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇస్తున్నట్లుగా రూ. 5 లక్షల రూపాయలు ఇస్తారా? లేక అవే రూ. 3 లక్షలతో సరి పెడతారా అన్న విషయం మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. పైగా గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ఇండ్లు క్యాన్సిల్ చేసి, ఇందిరమ్మ పథకం కింద, తిరిగి ఇళ్లు మంజూరు చేస్తారా అన్నది సస్పెన్స్ గా ఉంది.
అవును వాస్తవమే..
గృహలక్ష్మి పథకం కింద మా అమ్మ ఇందిర పేరిట ఇల్లు మంజూరు అయ్యిందని, ఇంటి నిర్మాణం పనులు ఎక్కడి వరకు వచ్చాయని అధికారులు నాకు ఫోన్ చేసి అడిగిన విషయం వాస్తవమేనని గృహలక్ష్మి మంజూరైన మహిళ కుమారుడు అనిల్ చెప్పారు. ఇంటి కోసం మేము దరఖాస్తు చేసుకోకపోయినా మా అమ్మ పేరిట ఇల్లు మంజూరు కావడం ఎలా సాధ్యమైందోనని ఆశ్చర్యమేస్తోందన్నారు. తన ఇల్లును తాను సొంతంగా సంపాదించిన డబ్బులతో పాటు, బ్యాంకులో కొంత మొత్తం హౌస్ లోన్ తీసుకుని నిర్మించుకున్నానని అనిల్ తెలిపారు.
ఇండ్ల ప్రోగ్రెస్ పై వివరాలు సేకరిస్తున్నాం
గృహలక్ష్మి పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్ ఇచ్చిన ఇళ్ల లబ్దిదారుల్లో కొందరు ఇళ్లు నిర్మించుకున్నారని ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఆయన ‘దిశ’తో మాట్లాడుతూ.. గృహలక్ష్మి ఇళ్ల నిర్మాణాల ప్రొగ్రెస్ ఎంత వరకు వచ్చిందనే స్టేటస్ కోసం గ్రామాల వారీగా వివరాలను సేకరించే పనిలోఉన్నామని ఎంపీడీఓ పేర్కొన్నారు.:-ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి