దిశ ఎఫెక్ట్.. దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన శాస్త్రవేత్తలు, అధికారులు

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ గ్రామంలో ఇద్దరు రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన శాస్త్రవేత్తలు పరిశీలించారు.

Update: 2024-08-01 04:36 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ గ్రామంలో ఇద్దరు రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన శాస్త్రవేత్తలు పరిశీలించారు. 'నట్టేట ముంచిన నకిలీ మందులు' అనే శీర్షికన దిశ దిన పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటలో తలెత్తిన సమస్యలను, తెగుళ్లను బుధవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ప్రధానంగా మొక్కజొన్న కాండంకు బ్యాక్టీరియా, కుళ్లు తెగులు ఉధృతి మొదలైనట్లు గుర్తించినట్లు తెలిపారు. అధిక తేమ ఉన్న నేలల్లో ఎడతెరిపిలేని ముసురు వానలు కురిసే పరిస్థితుల్లో మొక్క కాండంకు కుళ్లు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. దీనిపై రైతులకు శాస్త్రవేత్తలు, అధికారుల బృందం పలు ముఖ్య సూచనలు చేసింది.

మొక్క ఆకుల అంచులపై ఏర్పడిన తెగులు ప్రభావంతో క్రింది ఆకులు కూడా పూర్తిగా ఎండిపోయి కాండం గోధుమరంగుకు మారుతుందన్నారు. వేడి నీళ్లలో ఉడకబెట్టిన బెండు లాగా తయారై, కాండాన్ని చీల్చి చూసినప్పుడు కనువి దగ్గర కణజాలం మెత్తగా నీటిలో తడిచినట్లు కనిపించి కుళ్లిపోయిన కోడిగుడ్డు వాసన వస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు పీక లాగినప్పుడు మొక్క నుండి విడిపోయి బయటకు రావడం జరుగుతుందన్నారు. దీన్ని నివారించడానికి 35 శాతం క్లోరిన్ కలిపిన బ్లీచింగ్ పౌడర్ ను ఎకరాకు నాలుగు నుండి ఐదు కేజీల చొప్పున వెదజల్లాలన్నారు. తాత్కాలింగా యూరియా వేయడం ఆపేయాలని సూచించారు. తాము సేకరించి తీసుకెళుతున్న శాంపిల్స్ అధారంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ నగేష్ కుమార్, డాక్టర్ మల్లయ్య వ్యవసాయ సహాయ సంచాలకులు వీరస్వామి, వ్యవసాయ అధికారి నరేష్‌లు బాధిత రైతులు శ్రావణ్, రవీందర్‌లతో కలిసి మొక్కజొన్న పంటను పరిశీలించారు.


Similar News