రైతు వేదికలు నిరుపయోగం..

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన పథకాలతో పాటు సాగు పై అన్నదాతలకు మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2020-2021 సంవత్సరంలో నిర్మించింది.

Update: 2024-06-23 13:03 GMT

దిశ, ఆలూర్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించిన పథకాలతో పాటు సాగు పై అన్నదాతలకు మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వేదికలను నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2020-2021 సంవత్సరంలో నిర్మించింది. అలాగే సమాచారాన్ని చేరవేయడం, రైతులంతా ఒకచోట సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు రైతు వేదికలను నిర్మించారు. దీనికి ప్రతి 5000 వేల ఎకరాలకు ఒక క్లస్టరు చొప్పున, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 106 రైతు వేదికలను నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. పలు రైతు వేదికలు అన్నదాతలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదు, లక్ష్యం నెరవేరడం లేదు. సమస్యలు, జిల్లా వ్యాప్తంగా చాలా రైతు వేదికల్లో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు లేవు. రైతు వేదికల్లో భూసార పరీక్షలు చేపట్టాల్సి ఉన్నా ఇప్పటివరకు ఒక్క పరీక్ష చేపట్టిన దాఖలాలు లేవు. వేదికలు చాలా చోట్ల గ్రామాలకు దూరంగా ఉండటం వల్ల రైతులు అక్కడికి వెళ్లి సమావేశాలు నిర్వహించుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలా వేదికలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి.

ఎరువులు, విత్తనాలు ఎక్కడ..

రైతు వేదికల ద్వారా రైతులకు ఎరువులు విత్తనాలు అందించేందుకు ప్రభత్వం నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కానీ, అందించిన దాఖాలాలు ఎక్కడా కనిపించలేదు. ఊరికి దూరంగా ఉండడంతో పాటు సిబ్బంది కొరత కారణంగా ఎరువులు అమ్మాలంటే అధికారులు జంకుతున్నారు. దీంతో చాలామంది రైతులు వివిధ గ్రామాల్లో ఉన్న సహకార సంఘాల గోదాములో, ప్రవేటు వ్యాపారుల నుంచి ఎరువులు తెచ్చుకుంటున్నారు. ఎంతో ఆర్భాటంగా రైతు వేదికలు నిర్మించి రైతులకు సేవలందిచాలకున్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రైతు వేదికల నిర్వహణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, లేనట్లయితే ఇవి గోదాములు మారి నిరుపయోగంగా తయారవుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైతు వేదికలో జరగాల్సినవి..

ప్రతీ వారంలో రైతులతో సమావేశం నిర్వహించి శాస్త్రవేత్తల సలహాలు, సాగు పద్ధతులు, మెలకువలు, పలు పంటలు తెగుళ్ల బారిన పడకుండా చర్యలు తీసుకోవడం పై వివరించాలి. రైతులకు ప్రభుత్వం అందించే పథకాలు గురించి వ్యవసాయ అధికారులు వివరించాలి. సమావేశాలు జరగనప్పుడు వీటి గురించే వివరించే వారు లేరు. కానీ ప్రస్తుతానికి రైతులు ఎక్కడ దొరికితే అక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు కాలం వెల్లదీస్తున్నారు.

నిర్వహణ ఖర్చులు రాక నిర్వీర్యం..

ప్రతీ నెల రైతు వేదికల నిర్వహణ ఖర్చుల కింద రూ. 9వేలు రూపాయలు చొప్పున 2020–21 సంవత్సరంలో కేవలం 5 నెలలకు సంబంధించి నిర్వహణ ఖర్చులు విడుదల అయ్యాయని, అప్పటినుండి ఇప్పటివరకు ఒక రూపాయి రాలేదని, స్వీపర్ లేక తామే క్లీన్ చేసుకుంటున్నామని అధికారులు వాపోయారు. రైతు వేదికల ద్వారా సాగులో మెలుకువలు, శిక్షణ కల్పించాలి, రైతు వేదికలు అందుబాటులోకి తీసుకురావాలి.


Similar News