జోడో యాత్రకు బ్రహ్మరథం
కామారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగింది..... Revanthreddy Padayatra
దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని శుక్రవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకున్న రేవంత్ రెడ్డి శనివారం కామారెడ్డి మండలం సరంపల్లి చౌరస్తా నుంచి జోడో యాత్రను ప్రారంభించారు. పీసీసీ చీఫ్ హోదాలో మొట్టమొదటిసారి కామారెడ్డికి విచ్చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కామారెడ్డి మండలం సరంపల్లి, చిన్నమల్లరెడ్డి, లింగాయిపల్లి గ్రామాల మీదుగా రాజంపేట మండల కేంద్రానికి చేరుకుంది. గ్రామాలకు చేరుకున్న పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు.
మార్గమధ్యలో చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఓ మహిళకు చెందిన ఇంటిని రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇల్లు శిథిలావస్థకు చేరడంతో మహిళను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామంలో బీడీ కార్మికులతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కలిసి బీడీలు చుట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీడీ పరిశ్రమను ఎత్తేసే కుట్ర చేస్తుందన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.