జోరుగా పీడీఎస్ దందా.. ఎమ్మెల్యే అనుచరుల పేరుతో బెదిరింపులు

నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతుంది. ముఖ్యంగా బోధన్ డివిజన్‌లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే తంతు కొనసాగుతుంది. శనివారం రాత్రి నిజామాబాద్

Update: 2023-03-06 02:07 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతుంది. ముఖ్యంగా బోధన్ డివిజన్‌లో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే తంతు కొనసాగుతుంది. శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా సరిహద్దులోని పోతంగల్ చెక్ పోస్టు నుంచి తరులుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు యత్నించిన వారిపై లోకల్ ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరించారు. ఏకంగా రైస్ మిల్లుకు రా నీ అంతు చూస్తా.. చంపేస్తామని బెదిరించారు. ఈ వ్యవహారం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బోధన్ సబ్ డివిజన్ పరిధిలోని రైస్ మిల్లులకు కేటాయించిన వంద కోట్ల సీఎంఆర్ పెండింగ్‌లో ఉందని, దాని వెనుక ప్రజాప్రతినిధి హస్తం ఉందనేది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో ఎఫ్‌సీఐ ఏకంగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బోధన్ డివిజన్‌లో ఉన్న రైస్ మిల్లుకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యాన్ని మర ఆడించకుండానే బహిరంగ మార్కెట్‌లో అమ్మేస్తారనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా బియ్యాన్ని సరిహద్దులు దాటించడం మిల్లర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఎఫ్‌సీఐకి సీఎంఆర్ అప్పగించేందుకు వారు పీడీఎస్ రీసైక్లింగ్‌నే నమ్ముకున్నారు.

అడ్డగోలుగా అక్రమ రవాణా..

నిజామాబాద్ జిల్లాలో సింహాభాగం రైస్ మిల్లులు బోధన్ డివిజన్‌లోనే ఉన్నాయి. నిజామాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్‌కు ధీటుగా బోధన్ డివిజన్‌లో సీఎంఆర్ కోసం ధాన్యాన్ని కేటాయించారు. అక్కడ వర్ని, రుద్రూర్, కోటగిరి, రెంజల్, బోధన్, నవీపేట్ ప్రాంతాల్లోనే రైస్ మిల్లులకు ధాన్యాన్ని కేటాయించారు. బోధన్ సబ్ డివిజన్ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండడంతో ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే సీఎంఆర్ కేటాయింపులు జరుగుతాయి. అదే కోణంలో అసలు రైస్ మిల్లు లేని వాటికి, సామర్థ్యాన్ని మించి కేటాయింపులు జరిపారనే ఆరోపణలు ఉన్నాయి. గత 2022 సీజన్ కు సంబంధించిన ధాన్యం తాలుకు బియ్యం ఇప్పటికీ ఎఫ్‌సీఐకు చేరని లెక్కలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి సీఎంఆర్ కోసం రీసైక్లింగ్‌ను ఎంచుకున్న మిల్లింగ్ మాఫియా దానిని పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పీడీఎస్ (రేషన్ బియ్యం) మాఫియా రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాల పరిస్థితి అటు ఉంచితే, వర్ని ఉమ్మడి మండలం, కోటగిరి మండలంతోపాటు బోధన్ మండలంలో కొన్ని రైస్ మిల్లుల నిర్వాహకులు పీడీఎస్ బియ్యం మాఫియా జీరో వ్యాపారం చేస్తూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం, దాడులు సైతం చేస్తూ చివరికి హత్యాయత్నాలు చేయడానికి కూడా వెనుకంజ వేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వర్ని మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ నిర్వాహకుడు మాత్రం ఏకంగా కొన్ని రైస్ మిల్లులను లీజుకు తీసుకొని, బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ బడా నేత బోధన్ నియోజకవర్గంలోని మరో బడా నేత అండదండలు చూసుకుని జీరో దందా జోరుగా నడిపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కోటగిరి మండల కేంద్రంలో ఓ రైస్ మిల్లు నిర్వాహకుడు సైతం ఇదే ధోరణిని అవలంబిస్తూ ఇరువురు ప్రతిరోజు రాత్రి 12 నుంచి ఉదయం 4గంటల వరకు పీడీఎఫ్ బియ్యం మాఫియా బీహార్‌, మహారాష్ట్ర, వివిధ రాష్ట్రాలకు భారీగా తరలిస్తున్నారని చెప్పాలి. కోటగిరి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ నిర్వాహకుడు వర్ని మండల కేంద్రంలోని రైస్ మిల్ నిర్వాహకులు రెచ్చిపోతున్నారని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాత్రిపూట జరుగుతున్న పీడీఎస్ బియ్యం లారీలను ఎవరైనా ఆపితే వారిపై జులుం ప్రదర్శిస్తున్నారు. వర్నిలోని ఓ రైస్ మిల్ నిర్వాహకుడు మాత్రం పీడీఎస్ రీసైక్లింగ్‌లో తాను ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ వినిపిస్తున్నాయి.

నాయకుల అండదండలు..

ఓ రైస్ మిల్ నిర్వాహకుడు ఒకప్పుడు మార్కెట్లో రేషన్ బియ్యం అమ్ముకొని చిన్న వ్యాపారం చేసే సదురు వ్యక్తి నేడు కోట్లకు పడిగెత్తాడు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ బడా నేతతోపాటు బోధన్ నియోజకవర్గంలోని బడా నేతకు పీడీఎఫ్ బియ్యం మాఫియా చేసే ఓ రైస్ మిల్ నిర్వాహకుడికి సంబంధాలు ఉన్నాయనే విమర్శలు లేకపోలేదు. అంతేకాకుండా వారికి భారీగా మామూలు ఇస్తున్నారని ఆరోపణలు సైతం బాహాటంగానే వినిపిస్తున్నాయి. కోటగిరి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్ నిర్వాహకుడు సైతం వర్ని రైస్ మిల్ నిర్వాహకుడితో సరిసాటిగా తాను సైతం తక్కువ కాదంటూ ప్రతిరోజు ఆయన రైస్ మిల్లులోకి రాత్రి అయిందంటే చాలు పీడీఎస్ బియ్యం భారీగా చేరుతుందని తెలుస్తోంది. పోతంగల్ చెక్ పోస్టు నుంచి భారీగా పీడీఎస్ బియ్యం వచ్చి చేరుతున్న దీనిపై నిఘా నేత్రం కొరవడిందని, సీసీ కెమెరాల జాడ కనుమరుగయిందా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో బియ్యం మాఫియా దందా జరుగుతుంటే సంబంధిత శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులకు నెల వారి మామూళ్లు అందుతుండడంతోనే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏకంగా ఎమ్మెల్యే పేరు చెప్పి దందా నిర్వహిస్తున్నా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేస్తూ సరిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Tags:    

Similar News