ప్రజా పాలన సేవా కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించాలి

అభయహస్తం ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద గృహావసరాలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ది పొందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు.

Update: 2024-03-05 11:18 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : అభయహస్తం ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ. 500 లకే వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద గృహావసరాలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని లబ్ది పొందేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఎంపీడీఓ కార్యాలయాలు, మున్సిపల్ వార్డు కార్యాలయాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా అర్హులైన లబ్ధిదారుల వివరాలను ఆపరేటర్ల ద్వారా నిర్ణీత సాఫ్ట్ వేర్ లో అప్ డేట్ చేయించి ఆన్ లైన్లో పంపించాలని, ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా సాఫ్ట్ వేర్ లో వివరాల నమోదు విధానంపై జిల్లా కలెక్టర్ లతో మంగళవారం విద్యుత్ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఇతర రాష్ట్ర స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు తెలియజేశారు.

     అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆయా మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజా పాలన సేవా కేంద్రాల ఆపరేటర్లకు వీ.సీ ద్వారా ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తూ మార్గనిర్దేశం చేశారు. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేశామని, తెల్ల రేషన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలు లింక్ ఉన్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ గుర్తు చేశారు. అయితే, ప్రజా పాలన దరఖాస్తులు అందించిన సమయంలో వివరాలు సరిగ్గా నమోదు చేసుకోలేకపోయిన దరఖాస్తుదారులకు మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే ప్రధాన ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కేంద్రాల ద్వారా లబ్ధిదారుల గ్యాస్, ఆధార్, రేషన్ కార్డు, విద్యుత్ మీటర్ నెంబర్ తదితర వివరాలను సరి చేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోలేకపోయిన వారి నుండి నూతన దరఖాస్తులను సైతం సేవా కేంద్రాలలో స్వీకరించి వివరాలను సాఫ్ట్ వేర్ లో నమోదు చేయాలని అన్నారు.

    సంబంధిత సాఫ్ట్ వేర్ లో వివరాలను ఎలా అప్ డేట్ చేయాలనే దానిపై ఒక్కో అంశం వారీగా కలెక్టర్ క్షుణ్ణంగా తెలియజేశారు. లాగిన్ ఎలా కావాలి, పాస్ వర్డ్ మార్చుకోవడం తదితర విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. లబ్ధిదారుల ఆధార్ కార్డు/తెల్ల రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ ద్వారా ప్రజా పాలన దరఖాస్తును గుర్తించాలని, అనంతరం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్/విద్యుత్ మీటర్ నెంబర్ సరిపోలితే సదరు లబ్ధిదారులు ఇప్పటికే మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను అర్హులుగా ఎంపికైనట్టు నిర్ధారిస్తూ దరఖాస్తుదారులకు ఈ విషయం తెలియజేయాలన్నారు. ఒకవేళ వివరాలు సరిపోలని పక్షంలో మరోసారి సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్యాస్ కనెక్షన్ దరఖాస్తుదారు పేరిట కాకుండా కుటుంబ సభ్యులలో ఎవరి పేరిట ఉంటే, వారి ఆధార్ నెంబరును మహాలక్ష్మి పథకం వివరాలలో నమోదు చేయాలని అన్నారు. అయితే సదరు కుటుంబ సభ్యుడి పేరు తెల్ల రేషన్ కార్డులో తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుందన్నారు. ప్రజా పాలన సేవా కేంద్రాలలో అవసరమైన మేర దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని,

    సేవా కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. కాగా వివరాల నమోదు, వాటిని సరిచేసే విషయంలో ఎవరైనా అక్రమాలకు ఆస్కారం కల్పిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. వివరాల నమోదు విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ లోని ఈడీ ఎంను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని అన్నారు. ప్రజలు తమ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్ మీటర్ నెంబర్ వివరాలను వెంట తెచ్చుకుని ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా గృహ జ్యోతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలకు సంబంధించిన వివరాల నమోదు, వాటిని సరి చేసుకోవచ్చని తెలిపారు. ఒక తెల్ల రేషన్ కార్డు పై ఒక గ్యాస్ కనెక్షన్, ఒక విద్యుత్ మీటర్ కనెక్షన్ కు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, జెడ్పీ సీఈఓ ఉషా, డిప్యూటీ సీఈఓ సుందర వరదరాజన్, డీపీఓ చక్రవర్తి తరుణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఆయా మండలాల ఎంపీడీఓలు, ప్రజాపాలన సేవా కేంద్రాల ఆపరేటర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Similar News