Scanning mission : కామారెడ్డిలో మళ్లీ లింగ నిర్ధారణ పరీక్షల కలకలం..

కామారెడ్డి ( Kamareddy ) జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ స్కానింగ్ మిషన్లు అధికారులు సీజ్ చేయడం మరోసారి కలకలం రేపింది.

Update: 2024-10-26 07:20 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి ( Kamareddy ) జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ స్కానింగ్ మిషన్లు అధికారులు సీజ్ చేయడం మరోసారి కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి నుంచి లింగ నిర్ధారణ కోసం వాడే స్కానింగ్ మిషన్ ను ( Scanning mission ) గుట్టుగా కారులో ఇతర చోటికి తరలిస్తుండగా రైల్వే గేటు వద్ద శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. దీంతో పోలీసులు వైద్యశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో కారు డ్రైవర్ ను విచారించగా మరొక స్కానింగ్ మిషన్ కూడా ఉన్నట్టు డ్రైవర్ వెల్లడించాడు. గతంలో లింగ నిర్ధారణ చేస్తున్నారని సీజ్ చేసిన ఆస్పత్రి పక్క భవనంలో స్టోర్ రూంలో ఉంచిన మరొక మిషన్ ను అధికారులు (Officers ) సీజ్ చేశారు.

రాత్రి ఒంటిగంట వరకు అధికారుల విచారణ కొనసాగినట్టు సమాచారం. అయితే సంబంధిత స్కానింగ్ మిషన్లు డా.ఇట్టం సిద్దిరాములుకు చెందినవిగా జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. గత కొద్దిరోజులుగా కామారెడ్డి కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా బహిర్గతం అయ్యాయి. ఇటీవల కొందరి పై కేసులు కూడా నమోదైనా బెయిల్ పై బయటకు వచ్చి మళ్ళీ అదే దందాను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల రాజంపేట మండల కేంద్రం అడ్డాగా ఓ ఇంట్లో లింగనిర్దారణ చేస్తుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేసు నమోదు చేశారు. బల్ల రవి అనే బీడీ కార్మికుడు చాటుగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారని, బల్ల రవితో పాటు మరొక నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఇంకా విచారణ కొనసాగుతుండగానే శుక్రవారం రాత్రి స్కానింగ్ మిషన్లు పట్టుబడటం కలకలం రేపింది. స్కానింగ్ మిషన్ కు సంబంధించి ఓ వైద్యునితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతున్నా పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.


Similar News