మొక్కలు నాటేది ఎలా..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కదులుతున్నారు.

Update: 2024-07-13 14:22 GMT

దిశ, మోర్తాడ్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కదులుతున్నారు. ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ఈ సంవత్సరం జిల్లాలో ప్లాంటేషన్ ద్వారా 19.61 లక్షల మొక్కలు, హోమ్ సీడ్ ద్వారా 5.5 లక్షల మొక్కలను నాటాలనే లక్ష్యంతో నర్సరీలో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. అందుకుగాను జిల్లాలోని 36 శాఖలకు లక్ష్యం నిర్దేశించారు. వర్షాలు కురవగానే ఉపాధి కూలీలతో గుంతలు తీయించి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. కానీ " అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని" అన్నట్లు తయారైంది. నర్సరీల నిర్వాహకుల పనితీరు. దీని పై దిశ ప్రత్యేక కథనం.

ఎక్కడివి అక్కడే...

ఏ గ్రామం నర్సరీలో పెంచిన మొక్కలను ఆ ఊరిలోనే నాటాలని అధికారులు నిర్ణయించారు. గతంలో కొన్ని గ్రామాలను కలిపి ఒకే నర్సరీలో పెంచడంలో ఇతర పల్లెలకు వాటిని తరలించడంలో రవాణా ఖర్చులు పెరిగిపోవడం. ఇతరత్రా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఊరూరా నర్సరీ ఏర్పాటుకు సంకల్పించింది. పంచాయతీలకే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. అవసరం మేర పెద్ద పంచాయితీల్లో ఎక్కువ, చిన్న పంచాయితీల్లో తక్కువ మొక్కలను పెంచుతున్నారు.

మొక్కలని నర్సరీలో సిద్ధంగా ఉన్నాయి. ఎండ తీవ్రత నుంచి మొక్కలను కాపాడటానికి గ్రీన్ మ్యాట్ లను ఏర్పాటు చేశామని, నిత్యం నీటి తడులు అందిస్తున్నాం అంటూ అధికారులు చెబుతున్నా నర్సరీల్లో మాత్రం మొక్కలు పెరగక నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది. ఈ సారి పూలు, పండ్లు, ఈత మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చాం. వర్షాలు కురువగానే గుంతలు తీయించి మొక్కలు నాటడం ప్రారంభిస్తాము అంటు గొప్పగా చెబుతున్న అధికార యంత్రాంగం నర్సరీల్లో పరిస్థితులను చూసి నోరు వెలబెట్టవలిసిందే అని ప్రజలు అంటున్నారు.

పర్యవేక్షణ లేకపోవడంతో...

అధికారులు నర్సరీలో జరుగుతున్న పనుల విషయంలో పర్యవేక్షణ లేకపోవడం. స్థానిక పంచాయతీ సిబ్బంది నర్సరీల వైపు వెళ్ళకపోవడం. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు నర్సరీలకు వెళ్లకుండా కూలీలకు వదిలివేయడంతో నర్సరీల్లో మొక్కలు సక్రమంగా పెరగకుండా మట్టి ప్యాకెట్లు దర్శనం ఇస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోర్తాడ్ మండలంలోని దార్మోరా గ్రామనర్సరీలో జామ చెట్లకు పురుగు వ్యాధి సోకడంతో ఆకులకు రంధ్రాలు ఏర్పడి నాటడానికి వీలులేకుండా ఉన్నాయి. శేట్ పల్లీ గ్రామంలోని నర్సరీలో జామ చెట్లు సగం పెరిగి సగం ఖాళీగా ఉన్న మట్టి ప్యాకెట్లు దర్శనం ఇస్తున్నాయని స్థానికులు తెలిపారు.

పాలెం గ్రామంలో ఉన్న నర్సరీలో మట్టి ప్యాకెట్లలో గడ్డి మొలిచినట్లు స్థానికులు పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో చాలా నర్సరీల్లో మొక్కలు చెట్లుగా పెద్దగా పెరిగి పోయి నాటడానికి వీలులేకుండా వృథాగా ఉన్నాయని పలువురు అంటున్నారు. కొన్ని వనాలలో మొక్కలను ఇష్టం వచ్చినట్లు ఉంచడంతో మొక్కలు సక్రమంగా ఎదగలేదు. మొక్కల పెంపకం కోసం ఇచ్చిన గ్రీన్ మ్యాట్ లను పక్కన పడేశారు.

వన మహోత్సవంలో రోడ్డు పక్కన నాటే మొక్క రూల్ ప్రకారం రెండు ఫీట్ల పొడవు ఉండాలి. ఇంటి వద్ద, ఇతర స్థాలల్లో నాటే మొక్కలు ఫీట్ నుంచి ఫీట్ నర ఉండాలి. కానీ చాలా నర్సరీలో మొక్కలు ఫీట్ పొడవు కూడా లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క నర్సరీ నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ. యాబై వేల నుంచి రూ. లక్ష ఇరవై వేల వరకు ఖర్చు చేస్తుంది. లక్ష రూపాయల ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Similar News