బొబ్బట్లు పెట్టాలె.. గాజులెయ్యాలే..

సంప్రదాయాలు పాటించడం తప్పేమీ కాదు. ఇప్పటి జనరేషన్ పిల్లలకు కూడా అలనాటి సంప్రదాయాలను తెలియజేస్తుండటం కూడా ఇటీవల ట్రేండింగ్ గా మారుతోంది.

Update: 2024-07-04 10:46 GMT

దిశ, కామారెడ్డి : సంప్రదాయాలు పాటించడం తప్పేమీ కాదు. ఇప్పటి జనరేషన్ పిల్లలకు కూడా అలనాటి సంప్రదాయాలను తెలియజేస్తుండటం కూడా ఇటీవల ట్రేండింగ్ గా మారుతోంది. రాబోయే తరాలు కూడా పాత పద్ధతులను అలవాటు చేసుకునే సంప్రదాయం ఈ మధ్య నేర్పడం చూస్తున్నాం. సంప్రదాయాన్ని మర్చిపోవడం మంచిది కాదు అని చెప్పడం వరకు బాగున్నా కొత్త సంప్రదాయాలకు శ్రీకారం చుట్టడమే ఇటీవల ట్రెండ్ సెట్ అవుతుంది. కొత్త కొత్త ఆచారాలు, పద్ధతులు కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నా తప్పనిసరి పాటించాల్సిన పరిస్థితి కల్పించడమే విడ్డూరంగా ఉంది. గత కొన్ని నెలలుగా వస్తున్న ఆ కొత్త సంప్రదాయాల పై దిశ ప్రత్యేక కథనం.

వైరల్ అవుతున్న కొత్త పుకార్లు..

కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఇంటికి వస్తే ముందుగా వారి నోరు తీపి చేసి తెలిసిన మర్యాదలు చేసి కొత్త బట్టలు పెట్టడం నాటి నుంచే వస్తోంది. ఈ జనరేషన్ లో కూడా ఈ పద్ధతి ఇంకా కొనసాగడం, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతూనే వుంటుంది అని తెలుస్తోంది. అయితే కొన్ని పుకార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కాని క్షణాల్లో ఆ వైరల్ గా మారుతున్నాయి. వాటిని వైరల్ చేసి అంతటితో ఊరుకోవడం లేదు. ఒకరిద్దరు వాటిని పాటించి చూపించడంతో మిగతా వాళ్ళు కూడా పాటించడం మొదలు పెడుతున్నారు. ఇక అది అందరికీ అలవాటుగా మారేలా చేస్తున్నారు.

ఆడపడుచులకు గాజులు పెట్టాలి..

ఇటీవల ఒక పుకారు బాగా వైరల్ గా మారుతోంది. ఆడపడుచులకు గాజులు పెట్టాలి.. లేకపోతే వాళ్ళకు మనకు దూరం బాగా పెరిగి పోతుందట.. మాటల్లో తేడాలొస్తాయట.. ఇవన్నీ కొని తెచ్చుకోవడం దేనికి.. గాజుల షాపునకు వెళ్లి ఓ నాలుగు డజన్ల గాజులు తీసుకుని మన ఆడపడుచులకు పెట్టేస్తే సరిపోతుంది. లేకపోతే మనింటికీ రావడం మానేస్తారేమో అనే అనుమానంతో తెగ షాపింగులు చేసేస్తున్నారు. అంతటితో ఆగిపోతుందా అంటే కుదరనే కుదరదు. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయకుంటే బాగుండదు కదా.. ఆ సమయంలో ఇంట్లో డబ్బులు లేకపోయినా ఎక్కడైనా అప్పు చేసైనా ఏదో ఒకటి చేయాలి. గాజులు వేసిన వదినకు కనీసం ఒక 500 రూపాయలు, జాకెట్ ముక్క అయినా పెట్టి సాగనంపాలి.

చీరలు.. బొబ్బట్లు.. చక్కెర కుడుకలు

ఇక మరొక కొత్త పుకారు ఏంటంటే వదిన మరదళ్లకు చీరలు పెట్టాలి. మనవరాళ్లకు కుడుక చక్కెర పోయాలి. మనమళ్లకు బొబ్బట్లు చేసి పెట్టాలి. ఇదొక కొత్త ట్రెండ్ అవుతోంది. ఇటీవల ఈ పద్ధతి వందలాది మంది ఫాలో అయ్యారు కూడా. చీరలు కొనడానికి షాపింగ్ కి వెళ్లి నచ్చిన చీర తీసుకుని వెళ్లి వదిన మరదళ్లు కొత్త సంప్రదాయాన్ని పూర్తి చేస్తున్నారు. ఇక అమ్మమ్మలు అనుకోని పరిస్థితుల్లో మనవడు, మనవరాళ్లకు కుడుక చక్కెర పోయకపోయినా.. బొబ్బట్లు చేసి పెట్టకపోయినా మా పిల్లలంటే మీకు ప్రేమ లేదు. మీకు వాళ్ళ పిల్లలు అంటేనే ఇష్టం.. మా పిల్లకు ఎందుకు చక్కెర కుడుకలు పోస్తారు.. బొబ్బట్లు ఎక్కడ చేస్తారు అని శాపనార్థాలు పెట్టేవాళ్ళు కూడా ఉండటంతో కష్టమైనా ఆ తంతును పూర్తి చేసే అమ్మమ్మలు కూడా ఉన్నారు.

అన్నదమ్ముళ్లకు కూడా..

కొన్నాళ్ల క్రితం అన్నదమ్ముళ్లకు కూడా చక్కెర కుడుకలు పోయాలి అనే కొత్త సంప్రదాయం కూడా వైరల్ గా మారింది. అన్నదమ్ములు లేని ఆడపడుచులు తమకు వరుసకు అన్నదమ్ములు అయ్యే వారికి కుడుక చక్కెర పోసి సంబురపడ్డ సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని సంప్రదాయాలలో గమనిస్తే ఆడవాళ్లు మాత్రమే చేసేలా పుకార్లు సృష్టించారు. ఎక్కడ కూడా పురుషులు ఇలా చేయాలి.. అలా చేయాలి అనే ఒక్క పుకారు కూడా బయటకు రాలేదంటే నిజంగా గొప్ప విషయమే.

సీజన్ లేకున్నా వ్యాపారం..

వరుసగా వస్తున్న కొత్త కొత్త పుకార్లతో ప్రజల జేబులు ఖాళీ అవుతున్నా వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. చక్కెర కుడుకలు పోయడం.. బొబ్బట్లు చేయడం వాటితో కిరాణా దుకాణ వారికి, చీరలు గాజులు వేయడానికి బట్టల దుకాణాలు, బ్యాంగిల్ స్టోర్స్ మాత్రం జనాలతో కిక్కిరిసి పోతున్నాయి. దాంతో సీజన్ లేకున్నా వ్యాపారం మాత్రం జోరుగా సాగుతుందన్న మాట. మొత్తం మీద పండగలు, పెళ్లిళ్లు మాత్రమే కాకుండా ఇలాంటి పుకార్లతో ప్రతి రోజులు ఇళ్లల్లో ఏదో ఒక పండగ వాతావరణం ఉండటంతో బంధువుల రాకపోకలతో ఇళ్ళన్ని సందడిగా మారుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడంతో మహిళల రాకపోకలకు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా పోయింది.


Similar News