ప్రకృతి వనంతో పరేషాన్

గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే కోటగిరి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

Update: 2024-02-17 09:10 GMT

దిశ, కోటగిరి : గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే కోటగిరి మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. కొటగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు కూత వేట దూరంలో ఉన్న జెడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూల్, ఎస్సీ బీసీ హాస్టల్స్, విద్యాధికారి కార్యాలయంతో పాటు జూనియర్ కళాశాల కలిగి

    ఉన్న విద్యా సముదాయంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో పాఠశాలకు, కళాశాలకు వచ్చే మహిళా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యా సముదాయంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో అవుటర్స్ ఎంట్రీ తో ఆకతాయిల అడ్డాగా మారి పాఠశాలకు, కళాశాలకు వచ్చే విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో పాఠశాల ఆవరణంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయవద్దని విద్యార్థి సంఘాలు గగ్గోలు పెట్టి కలెక్టర్​కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మిగిలింది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా......

ఈ విద్యా సముదాయానికి సిబ్బంది కొరత కారణంగా నైట్ వాచ్మెన్ లేకపోవడంతో రాత్రి సమయాలలో కొందరు ఆకతాయిలు ఈ సముదాయాల ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఆకతాయిల ఆటలు కట్టడి చేయడం కోసం కొందరు ఉపాధ్యాయులు ప్రయత్నించగా తమకే ఎదురు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా పాఠశాల ఆవరణలో అసాంఘిక కార్యకలాపాల జరుగుతున్నాయని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మిగిలిందని వాపోతున్నారు.

    గతంలో పొతంగల్ ఉర్దూ మీడియం పాఠశాలలో దొంగలు బీభత్సం సృష్టించి కంప్యూటర్లను దొంగిలించిన సంగతి తెలిసిందే. అలాంటిది కోటగిరి విద్యాసముదాయానికి లక్షలు విలువ చేసే పరికరాలు ఉండగా నైట్ వాచ్మెన్ లేకపోవడంతో రాత్రి సమయాలలో పాఠశాల ఆవరణ మందుబాబులకు అడ్డాగా మారడంతో దొంగతనాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ జరగరాని సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారనే అంశం చర్చనీయంగా మారింది. వెంటనే అధికారులు స్పందించి ఆకతాయిల ఆటను కట్టడి చేసి నైట్ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Similar News