అధికారుల మధ్యవర్తిత్వం.. మద్యం షాపులకు మారుతున్న ఓనర్లు

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు చేతులు మారడం వెనుక అధికారుల హస్తం బయటపడింది.

Update: 2023-12-26 02:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు చేతులు మారడం వెనుక అధికారుల హస్తం బయటపడింది. కామారెడ్డి జిల్లా లక్కి డ్రాలో లభించిన మద్యం దుకాణాలను ఇతరులకు అప్పగించడంలో సర్కిల్ అధికారులు, ఎస్ఐ లు తలమునకలయ్యారని వినికిడి. లైసెన్సుల జారీ, నౌకరి నామాల వ్యవహారం అంతా ఎక్సైజ్ స్టేషన్ ల పరిధిలోని అబ్కారీ బాస్ ల చేతిలో ఉండటంతో వారు మద్యం దుకాణాలు చేతులు మారడం వెనుక మద్యవర్తిత్వం వహించడం విశేషం. దానితో కామారెడ్డి జిల్లాలో 10కి పైగా దుకాణాలు హైద్రాబాద్‌కు చెందిన వారు దక్కించుకోవడం గమనార్హం. అధికారులు మద్యం దుకాణాల మార్పిడి వెనుక ఉండి ఒక్కరి నుంచి ఇద్దరు వరకు చేతులు మార్పిడి వెనుక తతంగం నడపడం విశేషం.

ఈ విషయంలో అధికారులకు మంచిగానే గిట్టుబాటు కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 151 మద్యం దుకాణాలు ఉండగా కేవలం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాలు చేతులు మారినట్లు ఇంటెలిజెన్స్ నివేదికలో బహిర్గతమైంది. లక్కీ డ్రాలో దుకాణాలను దక్కించుకున్న వారి నుంచి ఒక్కరిద్దరు కొనుగోలు చేయగా అంతకు రెట్టింపు ధరలు ఇప్పిస్తామని లిక్కర్ సిండికేట్ కు మద్యం దుకాణాలను అమ్మకం వెనుక పెద్ద తతంగం జరిగినట్లు అధికార వర్గాల బోగట్టా. ప్రతి మద్యం పాలసీ అమలు సీజన్ లో ఈ తతంగం వెనుక జరిగిన మతలబు వెనుక జరిగిన లావాదేవీలపై అవినీతి నిరోధక శాఖ నజర్ వేసినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు చూపు తమపై పడటంతో అబ్కారీ అధికారుల్లో వణుకు మొదలైంది. మద్యం దుకాణాల యాజమాన్య హక్కుల మార్పిడిలో గత మూడు నెలలుగా జరిగిన తతంగం వెనుక ఎవరు ఎక్కువ వెనుకేసుకున్నారని ఆరా తీసే పనిలో పడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎక్సైజ్ శాఖ లో లక్కి డ్రాల ద్వారా జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో అధికారులకు కాసుల వర్షం కురిసిన కిందిస్థాయి సిబ్బందిని విస్మరించడం తో ఈ వ్యవహారం బయటకు వచ్చినట్లు చర్చ జరుగుతుంది. ఇటీవల కాలం జరిగిన ఈ వ్యవహారంలో డిసెంబర్ మాసంలోనే లైసెన్సులు జారీ, నౌకరి నామాల అప్పగింత సమయంలో బయటకు రావడంతో ఈ వ్యవహారం ఎక్కడ ఎక్సైజ్ కమిషనర్ లకు చేరుతుందో అని జిల్లా బాస్ లు, ఎస్‌హెచ్‌ఓలలో వణుకు మొదలైంది.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజా ప్రభుత్వం అని ప్రచారం జరుగుతుండగా అబ్కారీ అధికారులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మద్యం దుకాణాల యాజమానులను మార్చుతూ అప్పనంగా జేబులు నింపుకున్న వైనం బహిర్గతం కావడం ఎక్కడ తమకు తమ పోస్టింగ్‌లకు ఎసరు వస్తుందోనని భయపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు ఇన్‌చార్జిగా రాష్ర్ట ఎక్సైజ్ మంత్రి జూపల్లి కి బాధ్యతలను అప్పగించడం, మంగళవారం జిల్లా పర్యటన ఖరారు కావడం అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. మంత్రి పర్యటన పూర్తయ్యే వరకు జిల్లాలో ఇటీవల వరుసగా అబ్కారీ శాఖ జరుగుతున్న చీకటి కార్యకలపాలు ఎక్కడ బహిర్గతం అవుతుందో అని అధికారులలో ఆందోళన మొదలైంది. అంతేగాకుండా ఎక్సైజ్ శాఖ కమిషనర్ మార్పిడి వెనుక ఏదో జరుగుతుందో తెలియడం లేదని ఎక్సైజ్ శాఖలో చర్చ జరుగుతుంది.


Similar News