జనవరి 4న ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానంపై సమావేశం

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2023-12-19 15:06 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ఉదయం 11 గంటలకు అవిశ్వాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ లో 36 మంది మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఉండగా, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ గా మున్ను భాయ్ లు ప్రస్తుతం పాలనలో వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇటీవల ఆర్మూర్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి మూడో స్థానానికి దిగజారి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేశాడని, జీవన్ రెడ్డి ఓటమికి కారకుడయ్యాడు అంటూ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ ను ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు 24 మంది కౌన్సిలర్లు ప్రస్తుత ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం

    కోరుతూ కలెక్టర్ కు వినతి అందజేశారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు 4 రోజుల పాటు ఆర్మూర్ మున్సిపల్ బీఆర్ ఎస్ కౌన్సిలర్లు శిబిరానికి వెళ్లి ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపారు. ఆర్మూర్ మున్సిపల్ లోని మెజార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ పత్రాన్ని అందజేయడంతో జిల్లా కలెక్టర్ అటు తరువాత ఏఏ పార్టీల తరఫున ఎందరు కౌన్సిలర్లు ఎంపికైనారనే విషయాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ ద్వారా నివేదిక తెప్పించుకొని పరిశీలించారు. అన్ని అంశాలను పరిశీలించిన కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని వచ్చే నెల జనవరి 4న ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ భూమేశ్వర్ 36 మంది కౌన్సిలర్లకు సమావేశ తేదీ, సమయం తదితర వివరాలతో కూడిన నోటీసును అందజేశారు.

అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే...

ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో 36 మంది మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. ఈ మున్సిపల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే తప్పకుండా మెజారిటీ గా 24 మంది కౌన్సిలర్ల సమ్మతి అవసరం. ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రస్తుతం ఏ పార్టీ బలాలు ఏ విధంగా ఉన్నాయనే పరిస్థితి ని పరిశీలిస్తే.. ఆర్మూర్ మున్సిపల్ అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం కౌన్సిలర్ మద్దతుతో కలిపి 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీకి ఆరుగురు కౌన్సిలర్లు ఉండగా, ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తో సన్నిహితంగా మెలుగుతూ ఆ పార్టీ కి అనుబంధంగా ఉన్నాడు. కానీ ప్రస్తుత ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ ఆమెతో కలిపి 8 మంది కౌన్సిలర్లతో హైదరాబాదులో క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ముగ్గురు కౌన్సిలర్లు సైతం ఆర్మూర్ చైర్ పర్సన్ పండిత్ వినీత భర్త పండిత్ పవన్ తో టచ్ లో ఉన్నట్లు ఆర్మూర్లో చర్చ నడుస్తుంది.

    బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు ఏ క్షణంలోనైనా ఆ పార్టీకి బై చెప్పి చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ క్యాంపులో చేరేందుకు సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తుంది. అవిశ్వాస తీర్మానం తేదీని జిల్లా కలెక్టర్ ఖరారు చేయడంతో బీఆర్ ఎస్ పార్టీలోని కౌన్సిలర్లు అంతా ఒక్కతాటిపై ఉన్నామని పైకి చెబుతూ ఇటీవల జిల్లా కలెక్టర్ కు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం కోరుతూ 24 మంది కౌన్సిలర్ల సంతకాలతో పత్రాన్ని అందజేసినప్పటికీని, ఆ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు తెలుస్తుంది.

    వీరితోపాటు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మాన సమావేశంలో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు కీలకం కానున్నారనే విషయం కనబడుతుంది. ఆర్మూర్ లో జరిగే అవిశ్వాస తీర్మాన సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తారా లేదా గైర్హాజరవుతారా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠను నెలకొంది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్ల తో చైర్​పర్సన్ మంతనాలు చేస్తూ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గకుండా చేసేందుకు పావులు కదుపుతున్నారు. జనవరి 4వ తేదీన నిర్వహించే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా.. వీగిపోతుందా అనే విషయం తేట తెల్లం కానుంది.


Similar News