సబ్ రిజిస్ట్రార్ కు మెమో జారీ చేసిన అధికారులు..

దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్న స్థలం పరాయి వ్యక్తుల పాలైంది.

Update: 2024-06-26 15:14 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్న స్థలం పరాయి వ్యక్తుల పాలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే ఈ తతంగం జరగడం ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్ధాల కాలం నాటి స్థలం బల్ధియాలో కాంగ్రెస్ పార్టీ పేరు పైన ఇంటి నంబర్ కలిగి ఉండగా ప్రైవేట్ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరుగడం కలకలం రేపుతుంది. నిజామాబాద్ నగరంలోని హైమదీబజార్ (శంభుని గుడి) వెనుక కాంగ్రెస్ పార్టీకి 75 గజాల స్థలం ఉంది. దశాబ్ధాలుగా అది కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉంది. అక్కడ ఎలాంటి నిర్మాణం లేకపోవడంతో అక్కడ చిన్న టీ స్టాల్ నడుస్తుంది. అయితే సంబంధిత స్థలం పై పని చేసిన కొందరు గతేడాది సెప్టెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకు మొత్తం నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 11 సెప్టెంబర్ 2023న మహ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి మహ్మద్ మాజిద్ అనే వ్యక్తికి అమ్ముతున్నట్లు ఒప్పందం కుదిరింది. అయితే ఈ యేడాది ఏప్రిల్ మొదటి వారంలో యూసుఫ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా పాషా, రిజ్వానా బేగం అనే మహిళ మహ్మద్ మాజిద్ కు గత నెల 6న రిజిస్ట్రేషన్ చేశారు. అప్పటి వరకు సంబంధిత భూమి వారసుడిగా ఉన్న యూసుఫ్ మరణించగా లీగల్ హైర్ సర్టిఫికెట్ తో కానీ ఫ్యామిలీ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికేట్ తో అతని కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండగా డైరెక్ట్ సెల్ డీడ్ గా రిజిస్ట్రేషన్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన రిజిస్ట్రేషన్ల వ్యవహరం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ నాయకులు ఈ విషయం పై జిల్లా రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రార్ ప్రసూన ఈ విషయంలో రిజిస్ట్రేషన్ చేసిన నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ బాదర్ కు మెమో జారీ చేశారు. నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరగడం పరిపాటిగా మారింది. గతంలోనూ ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో, మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ రిజిస్ట్రార్లు, ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ల పై కేసులు నమోదయ్యాయి.

నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఒక డాక్యుమెంట్ రైటర్ కనుసన్నుల్లో ఈ తతంగం జరిగినట్లు తెలిసింది. నిజామాబాద్ నగర నడిబొడ్డున దేవాలయం ప్రక్కన లక్షల విలువ చేసే 75 గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహరం వెలుగులోకి రావడంతో అక్కడ రిజిస్ట్రేషన్ అధికారులు గప్ చుప్ అయ్యారు. ఇప్పటికే రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్ పై అవినీతి ఆరోపణలు ఉండగా 2023లోనూ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వ్యవహరంలో 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాధితుడు ఫిర్యాదు చేశారు. తాజాగా కాంగ్రెస్ నాయకులు కూడా జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోతే తాము కూడా ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా దేవాలయాలకు సంబంధించిన భూములకు రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. ఇప్పటికే ప్రముఖ దేవాలయమైన బడా రామ్ మఠ్, నీలకంఠేశ్వర, శంభుని గుడి, జండా బాలాజికి సంబంధించిన భూములు పేరుకు కౌలు రూపంలో నడుస్తుండగా వాటికి కూడా రిజిస్ట్రేషన్లు జరిగి అక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని వారసులు లేని భూములకు రాత్రికి రాత్రే వారసులు పుట్టుకురావడం, చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడం పరిపాటిగా మారింది. ప్రధానంగా ఒక వర్గంకు చెందిన వారు రిజిస్ట్రేషన్ అధికారులతో కుమ్ముకై రిజిస్ట్రేషన్లు చేయడం నిత్యతంతుగా మారింది.

ఈ విషయంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మొదలుకుని డీఐజీ కార్యాలయం వరకు వాటాలు ఇస్తున్నామని సబ్ రిజిస్ట్రార్లు బరితెగిస్తున్నారు. ఏకంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంకు దశాబ్ధాల క్రితం కేటాయించిన స్థలంకు రాత్రికి రాత్రి వారసులు పుట్టుకొచ్చి ఇతరుల పేరు మీదకు సెల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరుగడమే ఉదాహరణ అని చెప్పాలి. గతంలో సంవత్సరాల క్రితం ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల పై నజర్ వేసిన చాలా సంవత్సరాలుగా ఇటు రాకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల అవినీతి, అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News