ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసం

అసెంబ్లి ఎన్నికలలో అప్పటి అధికార పార్టీ ఓటమి తో ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

Update: 2023-12-12 12:59 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లి ఎన్నికలలో అప్పటి అధికార పార్టీ ఓటమి తో ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఓటమి తరువాత ఆయనే కేంద్రంగా రాజకీయ వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఆర్మూర్ మున్సిపల్ చైర్​పర్సన్ పై మెజార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్ లు అవిశ్వాస తీర్మానంకు సిద్ధమయ్యారు. ఎన్నికలలో జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణల నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత , ఆమె భర్త పండిత్ వినిత్ లపై జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ చైర్ పర్సన్ గద్దె నుంచి

    పండిత్ వినీతను దించేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంపు రాజకీయాలను షురూ చేసినట్లు సమాచారం. మంగళవారం ఆర్మూర్ బల్ధియాకు చెందిన 24 మంది కౌన్సిలర్ లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి అవిశ్వాస నోటీస్ ను అందచేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆకుల రాము మాట్లాడుతూ.. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో చైర్​పర్సన్ ఆమె భర్త చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినట్టు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అనేక విషయాల మీద అవకతవకలు జరిగాయని అన్నారు. ఆర్మూర్లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలకు, భూకబ్జాలకు, పండిత్ పవన్ కారణమని, అలాగే మున్సిపల్ చైర్ పర్సన్ గా పండిట్ వినీత పవన్ సరికాదని, వారిని పదవి నుంచి తొలగించి ఎన్నికలు జరపాలని కోరారు. కాగా ఆర్మూర్ బల్ధియాలో 36 మంది కౌన్సిలర్ లు ఉన్నారు. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ కు 30 మంది, ఐదుగురు బీజేపీ, ఒక మజ్లీస్ పార్టీ సభ్యులు ఉన్నారు. ఆర్మూర్ బల్ధియాకు 2020 జనవరిలో ఎన్నికలు జరిగాయి. ఆనాడు అధికార పార్టీ సభ్యురాలైన పండిత వినీతకు నాటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్ పర్సన్ పదవి లభించింది.

    నాలుగు సంవత్సరాలుగా పండిత్ వినీత భర్త పవన్ లతో రాజకీయంగా అంతా బాగుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పండిత్ పవన్ జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేశారని ప్రచారం జరిగింది. దానినే నిజమని నమ్మి అతన్ని పదవి నుంచి దించేయాలని బల్ధియా కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో అతనిపై అవిశ్వాసం పెడుతారని ప్రచారం మొదలయింది. కానీ ఇటీవల జీవన్ రెడ్డి కేంద్రంగా ఆర్మూర్ లో పలు వివాదాలు బహిర్గతం కావడంతో మున్సిపల్ చైర్​పర్సన్ పై అవిశ్వాసాన్ని వాయిదా వేశారు. కానీ కౌన్సిలర్ల ఒత్తిడితో చివరకు జీవన్ రెడ్డి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చైర్ పర్సన్ ను మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొందరు కౌన్సిలర్లకు చైర్ పర్సన్ చేస్తామని ఆశచూపడంతో వారు అవిశ్వాస తీర్మానానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి 24 మంది కౌన్సిలర్లను ఏకం చేసి పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం నోటీసులు జిల్లా కలెక్టర్ కు అందించడం విశేషం. దానిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేక ప్రభుత్వానికి నివేదిస్తారో కాలమే చెబుతుంది.

    ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై మెజార్టీ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడం ఆ పార్టీలోని రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ఎందుకంటే మెజార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ వైపు ఉన్నప్పటికీ వారు ఎక్కడ జంప్ అయితారోనని వారిని క్యాంప్ కు తరలించడం అందుకు కారణమని చెప్పాలి. 24 మంది మాత్రమే అవిశ్వాసంపై సంతకం పెట్టడంతో చైర్ పర్సన్ తో పాటు

     మరో ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అంతేగాకుండా ఎలాంటి బలం లేని చోట ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ రావడంతో వచ్చే బల్ధియా ఎన్నికల్లో బరిలో ఉండేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మాణం నెగ్గి ఎన్నికలు నిర్వహించినా పదవీ కాలం ఆరు నెలల ముందుగానే చెక్ పవర్ రద్దయ్యే అవకాశం ఉండడంతో ఎవరు ముందుకు వస్తారోనని చర్చ జరుగుతుంది. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి కోసం ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చే వారు క్యాంప్ రాజకీయంతో పాటు తాయిలాలను కూడా

    భరించాల్సి వస్తుండడంతో మెజార్టీ కౌన్సిలర్ల ఏకాభిప్రాయంపైనే అవిశ్వాసం, చైర్ పర్సన్ ఎన్నిక ఉంటుందని చెప్పాలి. ఒకవేళ జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుపకున్నా, ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూసినా ప్రత్యేక అధికారి పాలన తప్పదు. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్ బల్ధియా రాజకీయం అంతా రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. కౌన్సిలర్లు కాంగ్రెస్ కు జంప్ అయినా, అవిశ్వాసం పరీక్షలో పండిత్ వినీత నెగ్గినా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పెద్ద దెబ్బ అని చెప్పాలి. అందుకే అవిశ్వాసం పరీక్షలో పండిత్ వినీతను పదవి నుంచి దించేయాలని జీవన్ రెడ్డి పావులు కదుపుతున్నాడని చెప్పాలి. 


Similar News