రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు అన్నారు.

Update: 2024-06-23 10:11 GMT

దిశ, నిజాంసాగర్ : రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ, రైతుల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు అన్నారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని రైతుల కోరిక మేరకు వానాకాలం పంటలకు గాను మొదటి విడత నీటి విడుదల కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో జూన్ నెలలో నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.6 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 15 రోజుల పాటు 1400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకుని పంటలను కాపాడుకోవాలని కోరారు. అలీసాగార్ వరకు 1 లక్ష 30 వేల ఎకరాలకు సరిపడా సాగు నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రెండు దఫాలుగా మొత్తం 2700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. దేవుడు ఇచ్చిన గొప్ప ప్రకృతి వరం నీళ్లను మనం కాపాడుకొని పొదుపుగా వాడుకుని పంటలను పండించుకోవాలని కోరారు.

రాష్ట్రంలోనే మొదటగా నిజాంసాగర్ నీటి విడుదల.. పోచారం శ్రీనివాస్ రెడ్డి.

రాష్ట్రంలోనే మొదటిసారిగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ఏడాది యాసంగిలో నీటి విడుదలను క్రమబద్ధీకరణ చేయడంతోనే ప్రస్తుతం నీళ్లు మిగిలాయని అన్నారు. 1932వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వ హయంలో నిర్మించిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పురాతన, అతి పెద్ద ప్రాజెక్టు అని అన్నారు. 2.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు నిర్మించిన, కాలక్రమేణా నీటి సామర్థ్యం తగ్గి ప్రస్తుతం 17.802 టీఎంసీల నీటి సామర్థ్యం కల్గి ఉంది. అందుకు గాను 1.30 వేల ఎకరాలు పది మండలాల పరిధిలో సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు సమయానికి కురవక పోయినా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా 2 టీఎంసీల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు.

నీటిని విడుదల వారీగా విడుదల చేసి రైతులను ఆదుకుంటాం అని హామీనిచ్చారు. పంటలను ముందస్తుగా వేసుకొని పంట కోతల సమయంలో పంట నష్టం జరగకుండా చూసుకోవాలని రైతులను కోరారు. అదేవిధంగా ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల చేస్తున్నప్పుడు రైతులు, పరివాహక ప్రాంతం ప్రజలు కాలువలో దిగకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాపేధర్ శోభ రాజు, ఎంపీపీ పటోళ్ల జ్యోతి దుర్గారెడ్డి, మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, మహిళ అధ్యక్షురాలు శారద, అనీస్ పటేల్, ప్రజా పండరి, గుర్రపు శ్రీనివాస్, గౌస్ పటేల్, అబ్దుల్ ఖలేక్, సవాయి సింగ్, చీకోటి మనోజ్ పటేల్, వాజిద్ అలి, గంగారెడ్డి, రమేష్, లాల్ సింగ్, రాము రాథోడ్, నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్, ఎస్ ఈ వసంత, ఈఈ సొలొమాన్, ఏఈ శివ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Similar News